టిడిపి ఎంపినే అవమానిస్తున్న ప్రభుత్వం

ప్రోటోకాల్ పాటించే విషయంలో చిత్తూరు తెలుగుదేశంపార్టి ఎంపి శివప్రసాద్ కే ప్రభుత్వం షాక్ ఇస్తోంది. మామూలుగా ప్రోటోకాల్ విషయంలో ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులు గోలచేస్తుండటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వైసిపి ఎంఎల్ఏలు ప్రోటోకాల్ విషయంలో ఎప్పటి నుండో గోలపెడుతున్నా చంద్రబాబునాయుడు కనీస మాత్రంగా కూడా లెక్క చేయటం లేదు. వారి కోవలోకి తాజాగా టిడిపి ఎంపి కూడా చేరిపోయారు.  పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి అభ్యర్ధులను కొన్నిచోట్ల ఎంఎల్ఏలుగా ప్రభుత్వం పరిగణిస్తు అరాచకాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇపుడదే సమస్యను అధికారపార్టీ ఎంపి శివప్రసాదే ఎదుర్కొంటున్నారు. తన విషయంలో ప్రభుత్వాధికారులు ప్రోటోకాల్ పాటించటం లేదని గోల పెడుతుండటం మాత్రం విచిత్రంగానే ఉంది. పోనీ శివప్రసాదేమైనా రాజకీయాలకు కొత్తా ? అంటే అదీ కాదు. ఎంపిగా గెలిచింది మొదటిసారా ? అంటే అదీ కాదు. రిజర్వుడు నియోజకవర్గంలో రెండోసారి ఎంపిగా గెలిచిన శివప్రసాద్ బాగా నోరున్న నేతే అనటంలో సందేహం లేదు. మరి అయినా అధికారులు ఎందుకు ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారు ?

 

ఎందుకంటే, ఈ ఎంపికి చంద్రబాబునాయుడుకు సరైన సంబంధాలు లేవు. ఆమధ్య బహిరంగంగానే చంద్రబాబుపై తిరుగుబాటు లేవదీసినంత పనిచేశారు. తర్వాత చంద్రబాబుతో మాట్లాడుకుని సర్దుబాటు చేసుకున్నారనుకోండి అది వేరే సంగతి. అప్పటి నుండి చంద్రబాబు దగ్గర ఎంపి మాట చెల్లుబాటు కావటం లేదు. పైగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపిని అందరూ దూరం పెట్టేస్తున్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కేది కూడా అనుమానమేనట. అందులో భాగంగానే ఉన్నతాధికారులు కూడా ఎంపిని ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం ఆహ్వానాలు పంపించటం లేదట.

 

ఆ విషయంలోనే శివప్రసాద్ గోల చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు అధికారులు ఎందుకు ఆహ్వానాలు పంపటం లేదో అర్ధం కావటం లేదంటున్నారు. కేంద్రమంత్రి జయంత్ శిన్హా చిత్తూరులో పర్యటిస్తే అధికారులు తనకు సమాచారం ఇవ్వలేదట. ప్రభుత్వంలోని 14  సంక్షేమ పథకాలకు తాను ఛైర్మన్ గా ఉన్న ఏ ఒక్క కార్యక్రమం సమావేశానికి కూడా పిలవటం లేదని బాధపడిపోతున్నారు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం విలువ ఇవ్వకపోతే ఎలాగంటూ అమాయకంగా అడగడటం విచిత్రంగానే ఉంది. ఇదే ప్రశ్నను నాలుగున్నరేళ్ళుగా వైసిపి ప్రజాప్రతినిధులు అడుగుతూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం జవాబు చెప్పటం లేదు. ఇక సొంత పార్టీ నేతలడిగితే సమాధానం ఇస్తుందా ?