అవును అనంతపురం మాజీ ఎంఎల్ఏ బి. గుర్నాధరెడ్డికి చివరికి వైసిపినే దిక్కైంది. వైసిపి నుండి తెలుగుదేశంపార్టీలోకి జంప్ చేసిన మాజీ ఎంఎల్ఏ చివరకు ఈరోజు మళ్ళీ వైసిపిలోనే చేరారు. తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన గుర్నాధరెడ్డి రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు, రాప్తాడు ఎంఎల్ఏ బికె పార్ధసారధికి పంపారు. అదే సమయంలో మళ్ళీ వైసిపి కండువాను కప్పుకున్నారు. నిజానికి ఈ మాజీ ఎంఎల్ఏ వైసిపిని వీడాల్సింది కాదు. కానీ వచ్చే ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి అవకాశం వస్తుందో రాదో అన్న భయంతో తెలుగుదేశంపార్టీలోకి దూకారు. ఎప్పుడైతే అభద్రత చోటు చేసుకుందో పార్టీ నాయకత్వంతో గ్యాప్ మొదలైంది.
వైసిపిలో డెవలప్మెంట్స్ ను అవకాశంగా తీసుకున్న టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాజీ ఎంఎల్ఏని గోకారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో గుర్నాధరెడ్డికి టిక్కెట్టు హామీతో పాటు పార్టీలో చేరిన వెంటనే మంచి పోస్టు ఇఫ్పిస్తానని జేసి హామీ ఇచ్చారు. దాన్ని నమ్మిన మాజీ ఎంఎల్ఏ వెంటనే తెలుగుదేశంపార్టీలోకి దూకారు. అయితే, రోజులు గడుస్తున్నా పార్టీలో మంచి పొజిషన్ సంగతి దేవుడెరుగు. అసలు గుర్తుంపే కరువైంది. దాంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా గాలిలో దీపం లాగ తయారైంది. పార్టీలోకి తీసుకునేటపుడు హామీలిచ్చిన జేసి కూడా ఏమీ మాట్లాడటం లేదు. దాంతో గుర్నాధరెడ్డిలో అంతర్మధనం మొదలైంది.
ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు పార్టీలు అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నాయి. కానీ మాజీ ఎంఎల్ఏలను మాత్రం టిడిపిలో ఎవరూ పట్టించుకోవటం లేదు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు మాజీ ఎంఎల్ఏ. అదే సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యాయత్నం జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకున్న గుర్నాధరెడ్డి నేరుగా జగన్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. టిడిపి నేత నేరుగా జగన్ ఇంటికే వెళ్ళి పరామర్శించటం పార్టీలో కలకలం రేపింది. అప్పటి నుండే అందరికీ అర్ధమైపోయింది గుర్నాధరెడ్డి ఎక్కువ రోజులు టిడిపిలో ఉండరని. ఆ అనుమానాలే ఇపుడు నిజమయ్యాయి. అలాగని వైసిపిలో టిక్కెట్టుపై జగన్ ఏమన్నా హామీ ఇచ్చారా లేదా అనే విషయంలో స్పష్టత అయితే లేదు. మరి ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఏమైనా స్పష్టత వస్తుందేమో చూడాలి.