టిడిపి ఎంఎల్ఏ జంప్ ? చంద్రబాబుకు షాక్

చూడబోతే చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. గుంటూరు జిల్లా రేపల్లె ఎంఎల్ఏ అనగాని సత్యప్రసాద్ బిజెపి చీఫ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్ళిన ప్రసాద్ దాదాపు గంటపాటు అమిత్ షా తో భేటి అవ్వటం పార్టీలో సంచలనంగా మారింది.

ఇక్కడ విషయం ఏమిటంటే మొన్న టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిల్లో గరికపాటి మోహన్ రావే దగ్గరుండి  ప్రసాద్ ను అమిత్ షా దగ్గరకు తీసుకెళ్ళారు. అంటే ఫిరాయించిన ఎంపిలతోనే టిడిపి ఎంఎల్ఏలకు బిజెపి గాలం వేయిస్తున్నట్లు అర్ధమవుతోంది.

పైగా అమిత్ షాతో భేటీ తర్వాత సత్యప్రసాద్ ఫిరాయింపు ఎంపి గరికపాటి ఇంట్లోనే మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి ఎందుకొచ్చావయ్యా అంటే అస్వస్ధతగా ఉన్న గరికపాటిని పరామర్శించేందుకు అంటు ప్రసాద్ బుకాయిస్తున్నారు. మరి అమిత్ షా తో భేటీ విషయాన్ని ప్రస్తావించినపుడు ఎంఎల్ఏ నోరు లేవలేదు.

మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చాలామంది ఎంఎల్ఏలు, నేతలు టిడిపిలో ఉండలేకపోతున్నారు. చాలామందిపై అవినీతి ఆరోపణలుండటం, విచారణ చేయించి ఎక్కడ చర్యలు తీసుకుంటారో అన్న భయంతోనే ఇమ్యూనిటి కోసం బిజెపిలోకి వెళ్ళిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి బిజెపిలోకి టిడిపి ఎంఎల్ఏల వలసలు ఎప్పుడు మొదలవుతాయో చూడాల్సిందే.