చంద్రబాబుకు జాకీలేస్తున్న టిడిపి మీడియా

పాపం చంద్రబాబునాయుడు మీడియా అవస్తులు చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. లేని గొప్పదనాన్ని చంద్రబాబు ఆపాదించి దేశంలోనే చంద్రబాబు అనే వ్యక్తి చాలా శక్తిమంతుడు అని జనాల మెదళ్ళల్లోకి చొప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఢిల్లీలో జరిగిన ఘటనే తాజా ఉదాహరణ. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకయ్యా వెళ్ళిందంటే బిజెపియేతర పార్టీలను సమావేశపరిచేందుకు చంద్రబాబు చొరవ తీసుకున్నారట. చంద్రబాబు ఆధ్వర్యంలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ సమావేశం కాబోతున్నాయట. చంద్రబాబు మీడియా అచ్చేస్తున్న ఇటువంటి రాతలు చూస్తుంటే నిజంగానే నవ్వొస్తోంది.

 

ఎందుకంటే, మంగళవారం నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. కాబట్టి ప్రతీ పార్టీ అధినేత తమ ఎంపిలతో ముందు రోజు సమావేశం అవటం ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీనే. అందులో భాగంగానే ఎంపిల ప్రాతినిధ్యం ఉన్న పార్టీల అధినేతలందరూ ఢిల్లీకి చేరుకున్నారు. అదే సమయంలో బిజెపియేతర పార్టీల్లో చాలా వరకూ యూపిఏలో భాగస్వాములే అన్న విషయం మరచిపోకూడదు. యూపిఏకి కాంగ్రెస్ పార్టీనే నేతృత్వం వహిస్తున్న విషయం అందరికి  తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలో భాగస్వామ్యపక్షాల సమావేశం కూడా ఈరోజు జరుగుతోంది.

 

ఆ సమావేంలో పాల్గొనేందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. అంటే మిగిలిన పక్షాలకు ఆహ్వానం అందినట్లే బహుశా చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందినట్లుంది. వాస్తవం ఇదైతే చంద్రబాబు చొరవతో బిజెపియేతర పార్టీలు ఈరోజు సమావేశమవుతున్నాయని భలే కలరింగ్ ఇస్తోంది చంద్రబాబు మీడియా. నిజానికి బిజెపియేతర పార్టీలను కలిపేంత సీన్ చంద్రబాబుకు లేదు. పైగా అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే, చంద్రబాబు కలిసిన జెడి, డిఎంకె, ఎన్సీపి, ఎన్సీ లాంటి పార్టీలన్నీ ఎప్పటి నుండో యూపిఏలో భాగస్వామ్య పార్టీలే. వాళ్ళందరినీ చంద్రబాబు కలిసి కొత్తగా ఒకటి చేయాల్సిన అవసరమే లేదు.

 

వివిధ పార్టీల అధినేతలందరూ ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి చంద్రబాబు వరుసబెట్టి అందరినీ కలుస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జాతీయ పార్టీల అధినేతలెవరూ వచ్చి చంద్రబాబును కలవలేదు. చంద్రబాబు వాళ్ళ దగ్గరకు వెళ్ళుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీని కలిశారంతే. నిజానికి మమత అయినా, యూపి మాజీ సిఎం మాయావతైనా చంద్రబాబుకు ఏమాత్రం కొరుకుడు పడే రకాలు కారు. వాళ్ళకు అసలు చంద్రబాబు అండ అవసరమే లేదు. ఎక్కువగా మాట్లడితే బిజెపియేతర పార్టీల అండ చంద్రబాబుకే చాలా అవసరం. ఆ విషయాలే ఎవరికీ తెలీదనుకుని చంద్రబాబు మీడియా రివర్సులో జాకీలేసి లేని ఇమేజిని చంద్రబాబుకు ఆపాదిస్తోంది. చూద్దాం మరి ఏమవుతుందో ?