టిడిపి సీట్లలో కోట్ల చిచ్చు

కాంగ్రెస్ తో  దశాబ్దాల  అనుబంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమవుతున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి టిడిపిలో చిచ్చు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత చంద్రబాబునాయుడుతో కోట్ల సుమారుగా గంటపాటు భేటీ అయ్యారు. తెలుగుదేశంపార్టీలోకి రావటానికి తనకు అభ్యంతరం లేదని అయితే, తనకు కర్నూలు ఎంపి టిక్కెట్టుతో పాటు తన భార్యకు డోన్, కొడుకుకు ఆలూరు అసెంబ్లీ నియోజవర్గాలు కేటాయించాలని షరతు విధించినట్లు సమాచారం. అంటే కోట్ల ప్యాకేజికి పట్టుబడుతున్నారే కానీ తనను నమ్ముకున్న మద్దతుదారుల కోసం మాత్రం ఏమీ అడగటం లేదన్నది స్పష్టమవుతోంది.

ఇక, కోట్ల డిమాండ్లతో టిడిపిలో చిచ్చు పెట్టినట్లే అయ్యింది. కోట్ల అడుగుతున్న కర్నూలు ఎంపి సీటులో వైసిపి ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆమెకు టిక్కెట్టు లేనట్లే. అలాగే డోన్ , ఆలూరులో కూడా నాలుగున్నరేళ్ళుగా టిడిపి నేతలు కెఇ ప్రతాపరెడ్డి, వీరభద్రగౌడ్ పనిచేస్తున్నారు. వీరిద్దరూ పోయిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధులు బుక్కన రాజారెడ్డి, జయరాములు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి కూడా నియోజకవర్గంలో బాగా యాక్టివ్ గానే ఉంటున్నారు.

ఇలాంటి నేపధ్యంలో కోట్ల టిడిపిలో చేరటమన్నది వారికి ఇబ్బందే. అందులోను డోన్ లో కెఇ ప్రతాప్ స్వయంగా ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తమ్ముడు, బిసి నేత. కాబట్టి డోన్ సీటును కెఇ కుటుంబం త్యాగం చేయటం అంత తేలికకాదు. అందులోను కోట్ల కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీలోకి చేర్చుకోవటాన్ని కెఇ కుటుంబం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే, దశాబ్దాల వైరం ఉంది కాబట్టి వ్యతిరేకించటం సహజం. అయితే కోట్ల టిడిపిలో చేరికను కెఇ అడ్డుకోలేరన్నది ఎంత తథ్యమో కెఇ సహాయ నిరాకరణ ఉంటుందనటమూ అంతే తథ్యం. కాబట్టి వీరిద్దరి మధ్య సమన్వయం కుదర్చటం చంద్రబాబుకు అంత తేలిక కాదు. ఇటువంటి నేపధ్యంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సిందే.