వంగలపూడి అనిత… మాజీ టీచర్. ముందు టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉంది. తర్వాత 2014లో చంద్రబాబు ప్రోద్బలంతో రాజకీయాల్లో వచ్చింది. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యే అయింది. మంత్రి పదవి కూడా పొందాలనుకున్నది. కానీ.. కుదరలేదు. అయితే.. ఎమ్మెల్యే అయితే అయింది కానీ.. అనిత.. ఏనాడూ తన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నా కూడా తమ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్న ఆ నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె నియోజకవర్గంలోనే ఆమెకు వ్యతిరేకత వచ్చింది.
కట్ చేస్తే 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఆమెకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ.. టీడీపీ తమ్ముళ్లు ఊరుకుంటారా? ఆమెకు పాయకరావుపేట టికెట్ ఇస్తే.. మేమే పనికట్టుకొని మరీ ఓడిస్తాం.. అని తెగేసి చెప్పడంతో చేసేది లేక చంద్రబాబు ఆమెకు కొవ్వూరు టికెట్ ఇచ్చారు.
అయితే.. కొవ్వూరులో ఆమె ఓడిపోయారు. అయినా కూడా చంద్రబాబు ఆమెకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. మళ్లీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా చేశారు. అయితే.. ఆమెకు ఎన్ని పదవులు ఇచ్చి అందలం ఎక్కించినా.. ఆమెను నమ్మడం మాత్రం కష్టమే అంటున్నాయి విశాఖ టీడీపీ వర్గాలు.
గంటా ఏది చెబితే అదే
అయితే.. ఆమెను తెలుగు తమ్ముళ్లు నమ్మకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఆమె మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రూప్ కావడమే. అవును.. 2014 లో ఎమ్మెల్యే అయ్యాక వంగలపూడి అనిత.. గంటా ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు గంటా వేరే పార్టీలోకి మారితే.. అనిత కూడా మరుక్షణం ఆలోచించకుండా పార్టీ మారుతుందని.. అందుకే ఆమెను నమ్మడం చాలా కష్టం అని తేల్చేశారు.
అయితే.. ఆమెకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నా… విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి అన్నా కూడా పడదని ముందు నుంచీ టాక్ ఉంది. అందుకే… అనితను నమ్మకుండా.. వచ్చే ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఓ డాక్టర్ ను బరిలోకి దింపాలన్నది అయ్యన్నపాత్రుడి ప్లాన్. ఈ నేపథ్యంలో ఆమెకు పాయకరావుపేట నియోజకవర్గం పగ్గాలు ఇచ్చినా కూడా ఆమె ఇప్పటికీ నియోజకవర్గాన్ని సందర్శించడం లేదని.. విశాఖలోనే మకాం వేసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆమెను నమ్మితే అడ్డంగా మోసపోవడమే తప్పితే ఇంకోటి కాదని టీడీపీ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.