ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ – జనసేన కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమతో కలిసి వస్తే బీజేపీని కూడా కలుపుకోవాలని పవన్ చేయని ప్రయత్నాలు లేవని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ 94 మందితో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా.. 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పవన్.. వాటిలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఈ క్రమంలో ఉమ్మడి బహిరంగ సభలతో జనాల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తాడేపల్లిగూడెంలో “జెండా” సభను నిర్వహించిన చంద్రబాబు – పవన్ లు ఈ నెల 17న చిలకలూరిపేటలో రెండో ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని భావిస్తున్న ఇరుపార్టీలు… అదే వేదికపై ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు!
టీడీపీ మహానాడులో భాగంగా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ఆరు పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం.. అది సాధ్యకాని పక్షంలో నెలకు రు.3,000 నిరుద్యోగ భృతి కల్పించడం చేస్తామని అన్నారు. ఇదే క్రమంలో స్కూలుకు వెళ్లే ప్రతీ విద్యార్థికీ ఏడాదికి రూ.15,000 అందించనున్నట్లు బాబు ప్రకటించారు.
ప్రతీ ఏటా రైతుకు రూ.20,000 ఆర్థిక సాయాన్ని రైతు భరోసాగా అందించనున్నారు. ప్రతీ ఇంటికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. ఇదే క్రమంలో ప్రతీ మహిళకూ నెలకు రూ.1,500 ఇవ్వడంతోపాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తాజాగా బీసీ డిక్లరేషన్ ను బాబు – పవన్ లు విడుదల చేశారు.
ఇక ఇప్పటికే తమ మేనిఫెస్టోతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలోని అంశాలను కూడా మేనిఫెస్టోలో జత చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా… యువతకు ఉపాధి, భవన నిర్మాణ కార్మికులకు ప్రోత్సాహకాలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఇన్సెంటివ్ లతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పల్లె అంశాలతో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది.