సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులపై తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఈ సమయంలో “రా.. కదలిరా” కు విరామం ఇచ్చిన చంద్రబాబు.. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో జనసేనతో సీట్ల సర్దుబాట్లపై కూడా ఒక క్లారిటీకి రావాలని బాబు సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో రాజమండ్రి అసెంబ్లీ టిక్కెట్ల విషయంపై స్థానికంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
అవును.. ఒకపక్క చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక, జనసేనకు కేటాయించాల్సిన సీట్లు వంటి విషయాలపై కసరత్తులు చేస్తున్నారనే కథనాలొస్తున్న వేళ… రాజమండ్రిలో అభ్యర్థులు ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కారణం… రాజమండ్రి టీడీపీకి పెట్టని కోట అని చెప్పొచ్చు!! గత ఎన్నికల్లో రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకున్నప్పటికీ.. రాజమండ్రిలో కాలు మోపలేకపోయింది వైసీపీ. అయితే… అలాంటి చోట్ల ఒక టిక్కెట్ జనసేనకు ఇస్తున్నారనే చర్చ నడుస్తుంది.
2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ స్థానాన్ని దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవాని, రూరల్ స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే… ఈసారి పొత్తు నేపథ్యంలో రూరల్ సీటును జనసేనకు కేటాయించబోతున్నారని.. అందులో భాగంగా అక్కడ కందుల దుర్గేష్ పోటీ చేయబోతున్నారని చర్చ నడుస్తుంది. దీంతో… బుచ్చయ్య చౌదరి సిటీ సీటువైపు చూస్తున్నారనే చర్చ మొదలైంది.
ఈ క్రమంలో.. టిక్కెట్ తమకే అంటే తమకే అంటూ ఎవరి ధీమాలో వారు ఉన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… పార్టీలో సీనియర్ నేతను, పొలిట్ బ్యూరో సభ్యుడిని, 2014 తోపాటు 2019 ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటినవాడిని, మహానాడును రాజమండ్రిలో ఘనంగా నిర్వహించడంతో ప్రధాన భూమిక పోషించినవాడిని.. అలాంటి తనకు అర్బన్ సీటు అడిగినా ఇస్తారు అని బుచ్చయ్యచౌదరి ధీమాగా ఉన్నారని.. ఆయన అనుచరులు కూడా అదే నమ్మకంతో ఉన్నారని అంటున్నారు.
మరోవైపు… చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి అన్నీ తానై చూసుకున్నానని.. ఆ సందర్భంగా లోకేష్ తో సాన్నిహిత్యం పెరిగిందని.. వీటన్నింటితోపాటు అచ్చెన్నాయుడి అల్లుడినేగాక.. ఆదిరెడ్డి అప్పారావు కుమారుడిని కూడా.. ఇక స్థానికంగా ఉన్న పలుకుబడి ఎలాగూ ఉంది కాబట్టి… టికెట్ తనదేనని వాసు ధీమాతో ఉన్నారట.
ఇలా… ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే.. నేతలు ఎన్ని తలచినా, అధినేత తలంపు ముఖ్యం కాబట్టి… చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. దీంతోపాటు.. చంద్రబాబు వీరిద్దరిలో ఒక్కరికే టిక్కెట్ ఇచ్చిన అనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది కుడా తదనుగుణంగా మరింత ఆసక్తిగా మారింది!!