పోటీ నుండి తప్పుకున్న టిడిపి అభ్యర్ధి

అవును పోటీ నుండి రెండో టిడిపి వికెట్ డౌన్ అయిపోయింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో టిడిపి తరపున టికెట్ ఖాయమైన బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుండి విరమించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని టిడిపి నాయకత్వానికి చెప్పేసిన బుడ్డా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. టికెట్ వచ్చిన తర్వాత కూడా పోటీ నుండి తప్పుకున్న అభ్యర్ధుల్లో బుడ్డా రెండో వ్యక్తి. మొదట నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలో టికెట్ ఖరారైన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ విధంగానే పోటీ నుండి తప్పుకున్నారు. కాకపోతే ఆదాల పోటీనుండి తప్పుకోవటమే కాకుండా ఏకంగా టిడిపికి రాజీనామా చేసేసి వైసిపిలో చేరిపోయారు. దాంతో టిడిపికి పెద్ద షాకే తగిలింది.

తాజగా బుడ్డా కూడా అలాగే పోటీనుండి తప్పుకోవటంతో ఈయన కూడా వైసిపిలో చేరుతారా ? అన్న ప్రచారం బాగా పెరిగిపోతోంది. అయితే, తాను పోటీ నుండి తప్పుకోవటంలో తన భార్య అనారోగ్యమే కారణమని బుడ్డా చెబుతున్నారట. ఇక్కడే అందరిలోను సందేహాలు పెరిగిపోతున్నాయ్. బుడ్డా భార్యకు అనారోగ్యం ఈనాటిది కాదు. నిజానికి ఆమె ఎప్పటినుండో అనారోగ్యంతోనే ఉన్నారు. అయితే అప్పుడంతా టికెట్ కోసం బుడ్డా తెగ పోరాటం చేశారు. తీరా టికెట్ ఖరారైన తర్వాత పోటీనుండి తప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

టిడిపి అభ్యర్ధి పోటీ నుండి తప్పుకోవటంతో చంద్రబాబుకు తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలు చూసుకోవటమంటే నిజానికి ఎవరికైనా కష్టమే. అందుకనే పార్టీలో సీనియర్ నేత నంద్యాల, ఆళ్ళగడ్డలో టికెట్ కోసం పోటీ పడిన ఏవి సుబ్బారెడ్డిని చంద్రబాబు పిలిపించుకున్నారు. శ్రీశైలంలో ఏవిని పోటీ చేయించాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

శ్రీశైలం నియోజకవర్గంలో మండలమైన మహానందిలో ఏవికి బంధుత్వం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏవి అయితే గట్టిపోటీ ఇస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. మరి శ్రీశైలంకు వెళ్ళి ఏవి పోటీ చేస్తాడా ? లేదా అన్నది తేలలేదు. ఇక్కడి నుండి వైసిపి తరపున శిల్పా చక్రపాణిరెడ్డి పోటీలో ఉన్నారు.  నిజంగానే భార్య అనారోగ్యం కారణంగా బుడ్డా పోటీ నుండి తప్పుకున్నారా ? లేకపోతే ఓటమి ఖాయమనే తప్పుకున్నారా ? అన్నది మాత్రం సస్పెన్సే.