నారా లోకేష్ ఒకప్పటిలా లేడు, యువ నాయకుడు రెడీ అవుతున్నాడు.. ఇవి నారా లోకేష్ గురించి ప్రస్తుతం టీడీపీలో వినిపిస్తున్న మాటలు. ఇన్నాళ్లు లోకేష్ మీద టీడీపీ శ్రేణులెవ్వరికీ పెద్దగా నమ్మకాలు ఉండేవి కావు. చీటికీ మాటికీ ప్రత్యర్థులకు దొరికిపోతూ దారుణంగా విమర్శలకు గురయ్యే లోకేష్ బాబును చూసి తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకునేవారు. మాట్లాడటానికి ఎంత మంచి అవకాశం వచ్చినా మౌనంగానే ఉండిపోయే చినబాబు నాయకత్వంలో భవిష్యత్తు అంధకారమే అనుకునేవారు. కానీ ఇప్పుడు అవన్నీ మారాయి. కొత్త లోకేష్ బయటికొచ్చాడు.
పార్టీ అద్వానపు స్థితిలో ఉండటం చూసి చలించాడో లేకపోతే తండ్రి కష్టం చూసి కరిగిపోయాడో తెలీదు కానీ ఉన్నపళంగా వేగం అందుకున్నాడు. హైదరాబాద్ వదిలి ఏపీలో అడుగుపెట్టాడు. అడపాదడపా శ్రేణులతో, లోకల్ లీడర్లతో మీటింగులు పెడుతున్నాడు. ఎవ్వరి అండా లేకుండానే వరద ప్రాంతాలకు పరామర్శకు వెళ్ళిపోతున్నాడు. లోకేష్ గతంలో కూడ ఇలాంటి పరామర్శ యాత్రలు చేసినా ఇప్పుడు చేస్తున్నవి వేరు. గతంలో బాధితులతో అంటీ ముట్టనట్టు ఉంటూ మొహమాటంతో మాట్లాడిన ఆయన ఇప్పుడు చొరవ తీసుకుని కలసిపోతున్నారు.
అనంతపురం జిల్లా శింగనమలలో వరదలతో పంట నీట మునిగి నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లిన ఆయన నేరుగా నీళ్లు నిండిన పొలంలోకి దిగేశారు. నీటమునిగిన పంటను చేతిలోకి తీసుకుని పరిశీలించారు. రైతులతో భుజం భుజం తాకించి మాట్లాడుతూ నష్టాల వివరాలు
తెలుసుకున్నారు. ఇవన్నీ చూసిన స్థానిక నేతలు ఇతను చినబాబేనా అంటూ ముక్కున వేలేసుకున్నారు. రైతుల మొహాల్లో సైతం లోకేష్ పరామర్శతో కొంత ఊరట కనిపించిందట. అయితే ప్రత్యర్థి పార్టీలు ఎప్పటిలానే చేయాల్సిన విమర్శలు, హేళనలు చేస్తూనే ఉన్నాయి. కానీ టీడీపీ కేడర్ మాత్రం మంచో, చెడో లోకేష్ అయితే మారాడు అనుకుని సంతోషపడుతున్నారు.