మహా కూటమికి సీట్ల ప్రకటన ప్రకంపనలు రేపుతున్నది. అన్ని పార్టీల్లో గెలుపు గుర్రాల పేరు చెప్పి అగ్రవర్ణాలకే సీట్లు కట్టబెడుతున్న వాతావరణం నెలకొంది. దీంతో కూటమిలోని మిగతా వర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కూటమిలో సీటు రాలేదని తేలడంతో కోదాడ నియోజకవర్గానికి చెందిన బిసి నేత బొల్లం మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ఉండాలి. మీరే ముఖ్యమంత్రి కావాలి. కానీ మీ కుటుంబంలో ఒక్క సీటును కూడా త్యాగం చేయరా అంటూ బొల్లం మల్లయ్య యాదవ్ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు కోదాడలో తాను కూటమి రెబెల్ గా బరిలోకి దిగబోతున్నట్లు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రకటించారు. నిజానికి బొల్లం మల్లయ్య యాదవ్ 2014లోనే గెలిచే చాన్సెస్ ఉన్నాయి అన్న చర్చ ఉంది. కానీ కొద్ది తేడాతో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గెలిచారు. దీంతో ఈసారి బొల్లం మల్లయ్య యాదవ్ కు కూటమి సీటు దక్కొచ్చని తొలుత ప్రచారం నడిచింది.
కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్యామిలీకి ఒక సీటు పాలసీ ప్రకారం ఉత్తమ్ పద్మావతి రెడ్డికి సీటు లేదన్న లీక్ వచ్చింది. ఉత్తమ్ ఫ్యామిలీ కూటమి కోసం ఒక సీటు త్యాగం చేయబోతున్నారని అన్నారు. కానీ ఇంకో ప్రచారం కూడా ఏక కాలంలో సాగింది. ఇప్పటికే సిట్టింగ్ సీటులో ఉన్న వారికి ఒక ఓటు ఒక ఫ్యామిలీ పాలసీ వర్కవుట్ కాదని కూడా టాక్ నడిచింది.
అయితే కూటమిలో అందరూ రెడ్డి నేతలే సీట్లు దక్కించుకోవడం, బిసి నేతలకు కూటమి మొండి చేయి చూపడం వివాదం రేపుతున్నది. షేర్ లింగంపల్లిలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కు టికెట్ లేదని తేల్చేశారు. అంతేకాకుండా జనగామలో సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు అక్కడి నుంచి పొగ పెట్టి వేరే సీటుకు పంపుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి పనితీరు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమెను మారిస్తే సీటు కూటమికి గ్యారెంటీగా దక్కేదని చెబుతున్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఉత్తమ్ చక్రం తిప్పి సీటును తన సతీమణికి ఇప్పించుకున్నారని అంటున్నారు.
ఉత్తమ్ తీరుపై బొల్లం మల్లయ్య యాదవ్ భగ్గుమన్నారు. ఉత్తమ్ పద్మావతిని ఓడించడమే లక్ష్యంగా, టిడిపిని గెలిపించడమే లక్ష్యంగా తాను కూటమ ిరెబెల్ గా బరిలో ఉండబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన సవాల్ చేశారు.
బొల్లం మల్లయ్య యాదవ్ మీడియాతో మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.