టీడీపీ, జనసేనల్లోకి చేరికలెందుకు తగ్గాయ్.?

ఎన్నికలొచ్చేస్తున్నాయ్.. అధికార వైసీపీ ఎన్నికల సమర శంఖం పూరించేసింది. వైసీపీలో టిక్కెట్లు దక్కని నేతలు, వేరే పార్టీల్లో టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంత హంగామా నడుస్తున్నా, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. దాంతో జతకట్టిన జనసేన పార్టీల నుంచి సౌండ్ సరిగ్గా రావడంలేదెందుకో.!

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు, వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. వారిలో ఒక్కరూ ఇంతవరకూ టీడీపీలోగానీ, జనసేనలోగానీ జాయిన్ అయ్యింది లేదు. చేరుతున్నట్లు ప్రకటనలు చేసి, ఆ తర్వాత ఆయా నేతలు సైలెంటయ్యారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరినా, వారి హడావిడి కూడా పెద్దగా కనిపించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జనంలోనే వున్నారు. జనసేన అధినేత మాత్రం, పార్టీ ముఖ్య నేతలతో మంతనాలకే పరిమితమవుతున్న పరిస్థితి.

దీనికి తోడు, టిక్కెట్ల పంపకాల విషయమై టీడీపీ – జనసేన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, ఆ రెండు పార్టీల్లో చేరాలకుంటున్న వైసీపీ నేతలు, ఇతర ఆశావహుల్ని అయోమయానికి గురిచేస్తోందని చెప్పొచ్చు.

అయితే, ముహూర్తాలు సరైనవి లేకపోవడంతోనే ఈ సందిగ్ధ పరిస్థితి అనీ, రానున్న రోజుల్లో రాజకీయం వేడెక్కుతుందనీ టీడీపీ, జనసేన చెబుతున్నాయి. అధికార వైసీపీ మాత్రం, ‘సిద్ధం’ అంటూ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగేసింది. టీడీపీ, జనసేన.. ఇంకా అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకోవాల్సి వుంది.