టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి సాధించే ఫలితాల సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీ గెలిచే సీట్లలో కూడా కొత్త తలనొప్పులు తప్పడం లేదనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. ఉదారహణకు పిఠాపురాన్ని వర్మకు వదిలేసి ఉంటే… టీడీపీకి గెలుపు సులువయ్యేది కానీ… అక్కడ పవన్ ని నిలబెట్టడంతో ఇప్పుడు వైకాపా దృష్టంతా అక్కడే ఉంది! అని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెనాలి టిక్కెట్ విషయంపైనా సమస్య తెరపైకి వచ్చింది.
పొత్తులో భాగంగా కచ్చితంగ గెలిచే అవకాశాలున్న సీట్లను జనసేనకు ఇస్తున్నారనే ఆరోపణ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉంది. ఈ విషయంలో రాజోలు టిక్కెట్ కూడా ఒకటి. గతంలో జనసేన గెలిచినా.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవనేది చాలామందికి తెలిసిన విషయమే. ఫలితంగా ఇప్పుడు రాజోలులో అటు రాపాక, ఇటు గొల్లపల్లి కలిసి మొహరించే సరికి జనసేన పరిస్థితి అత్యంత క్లిష్టమైపోయింది. లేకపోతే అది ఈసారి టీడీపీ ఖాతాలో అనే చర్చ జరిగింది.
ఇదే సమయంలో పిఠాపురంలో ఈసారి వర్మ కచ్చితంగా గెలుస్తారనే చర్చ స్థానికంగా బలంగా వినిపించింది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ని తెచ్చి అక్కడపెట్టారు! దీంతో… ఇప్పుడు ఆ టిక్కెట్ పైనా నీలినీడలు కమ్ముకున్నట్లు కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెనాలి సీటు కూడా ఈసారి టీడీపీ ఖాతలో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఆలపాటి రాజాను కాదని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కి కేటాయించారు.
పైగా రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడ నాదెండ్ల మనోహర్ చూపించిన పెర్ఫార్మెన్స్ పెద్దగా లేదనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో నాదెండ్ల పోటీలోనే లేరు. ఆ ఎన్నికల్లో ఆలపాటి రాజా 19వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019లో పోటీచేసిన నాదెండ్ల 30వేల లోపు ఓట్లు సాధించి మూడోస్థానికే పరిమితమైన పరిస్థితి. అంటే… ఇప్పుడు కూడా టీడీపీ కేడర్, ఆలపాటి రాజా అనుచరులు సహకరిస్తేనే మనోహర్ గెలుపుపై ఎంతో కొంత నమ్మకం పెట్టుకోవచ్చు. అలాకానిపక్షంలో… టీడీపీ చేజేతులా సీటు వదులుకున్నట్లు అవుతుందని అంటున్నారు.
ఈ సమయంలో ఆలపాటి రాజా అలిగారనే వార్త జనసేన వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టించిందని తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆలపాటి రాజా అలిగడం అంటే… అది నాదెండ్ల మనోహర్ కి అతిపెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశరంట బాబు. కానీ… ఆలపాటికి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని.. బుజ్జగించి పంపించేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలపాటి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.
అదే జరిగి.. ఈ పరిస్థితుల్లో ఆలపాటి రాజా టీడీపీకి బై బై చెప్పడమో.. లేక, రెబల్ గా బరిలోకి దిగడమో అంటూ జరిగితే మాత్రం ఆ సమస్య కచ్చితంగా నాదండ్ల మెడకు చుట్టుకున్నట్లే అవుతుంది! కారణం… అక్కడ వైసీపీ నుంచి శివకుమార్ బలంగా ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ – జనసేన కలిస్తే తప్ప ఆయనను కదిలించడం దాదాపు అసాధ్యం అని చెబుతున్నారు. ఈ సమయంలో ఆలపాటి వారు అలిగితే… నాదేండ్ల నలిగినట్లే అని అంటున్నారు పరిశీలకులు.