బాలినేని వ్యవహారంలో అరెస్టులు మొదలయ్యాయి.. కానీ అరెస్టవుతోంది నిందితులు కాదు

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సన్నిహితుడికి చెందిన వాహనంలో భారీ ఎత్తున నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే.  ఈ డబ్బును ఏపీ పోలీసులు కాకుండా తమిళనాడు పోలీసులు పట్టుకోవడంతో విషయం బాగా సీరియస్ అయింది.  ఈ డబ్బు మొత్తం తనదేనని, దానికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించుకున్నారు.  శ్రావణమాసం కావడంతో బంగారం కొనుగోలుకు చెన్నైకి డబ్బును తీసుకుని వెళుతుంటే పోలీసులు ఆపారని బాలు అన్నారు.  పైగా ఆ కారుకు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు మీద స్టిక్కర్ కూడా ఉంది.  
 
దీంతో టీడీపీ తన ప్రతిపక్ష పాత్రను పోషించింది.  మంత్రి బాలినేని హవాలా చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు స్టార్ట్ చేశారు.  ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న నోట్ల కట్టలు చూస్తే వైకాపా నేతల దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది అంటూ మాట్లాడుతున్నారు.  నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నుండి ఇతర నేతలు, కార్యకర్తల వరకు వైకాపా హవాలాకు పాల్పడుతోందని, ఆ డబ్బు బాలినేనికి చెందినదేనని, ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని అన్ని మాధ్యమాల్లో మాట్లాడుతూ వచ్చారు. 
 
ఇక టీడీపీ కార్యకర్తలైతే అసలు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఏపీ దాటి తమిళనాడు వరకు వెళితే ఆంధ్రా పోలీసులు ఏం చేస్తున్నారని, తమిళనాడు పోలీసులకి చిక్కడంతో పరువు పోయిందని ఎద్దేవా చేస్తున్నారు.  ఇక టీడీపీ కార్యకర్తలైతే సోషల్ మీడియాలో అధికార పార్టీ మీద విమర్శలు గుప్పిస్తుండటంతో పోలీసులు వారి మీద దృష్టి పెట్టారు.  అందులో భాగంగా వడ్డెల సందీప్ అనే టీడీపీ కార్యకర్త అసలు అంత డబ్బు ఏపీని దాటి ఎలా వెళ్లింది అంటూ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రశ్నించాడు.  దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  దీంతో అతను సెల్ఫీ వీడియోలో పోలీసులు తీసుకెళ్ళి కొట్టడం, వేధించడం చేస్తున్నారని, రౌడీ షీట్ పెడతామని బెదిరిస్తున్నట్టు వాపోయాడు.  దీంతో హవాలా బాధ్యులను పట్టుకోకుండా ఇలా ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.