బుడ్డోడి విషయంలో ఆ బుద్ధి అప్పుడేమైంది జనార్దన్?

కొన్ని రోజుల క్రితం హైద్రాబాదులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవానికి రాజకీయ ప్రముఖులుతో పాటు, సినిమా పరిశ్రమకి చెందిన నటీనటులు అవకాశం ఉన్నమేరకు హాజరయ్యారు. ప్రత్యేక అతిధిగా పిలిచిన పవన్ మాత్రం డుమ్మా కొట్టారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అని వార్త నెట్టింట బాగా వైరల్ అయింది.

అయితే ఈ ఉత్సవ కమిటి చైర్మన్ టిడి జనార్దన్.. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు.. “అతను ముందుగానే ఎదో టూర్ పెట్టుకున్నాడు” అని చెప్పాడు. ఈ విషయాలపై మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిన జనార్ధన్…”నేను, నందమూరి రామకృష్ణ గారు అతన్ని వెళ్లి కలిసాం.. నాకు ఆరోజు టూర్ వుంది అన్నా, 22 కుటుంబాలు కలిసి వెళుతున్నాం అన్నాడు” అని చెప్పాడు. అప్పుడు మేము “నీ పుట్టినరోజులు ముందు ముందు చాలా వస్తాయి, కానీ అన్నగారి శతజయంతి ఒక్కసారే వస్తుంది” అని కూడా చెప్పాము. అయినా కూడా ఆయన ఉదయం అంతా అభిమానులను కలిసి మధ్యాహ్నం వెళ్లిపోయారు అని చెప్పారు.

దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. విజయవాడలో కూడా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి.. సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో జరిగిన ఆ ఉత్సవాలకు జూనియర్ ని పిలవలేదు.. రజనీకాంత్ ని పిలిపించుకుని… ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కాస్తా చంద్రబాబు అభినందన సభలా ముగించారు.. అలాంటప్పుడు హైదరబాద్ లో మాత్రం పిలిస్తారని జూనియర్ ఎలా భావిస్తారు? అనేది ఆయన అభిమానుల ప్రశ్నగా ఉంది. సుమారు 22 కుటుంబాలవారు కలిసి వెళ్తున్న ఈ కార్యక్రమాన్ని ఏనాడో ఫిక్స్ చేసుకున్నారని చెబుతున్నారు!

ఇప్పుడు పనికిమాలిన కబుర్లు చెబుతున్న జనార్ధన్ జ్ఞానం నాడు ఏమైపోయిందని ఫైరవుతున్నారు జూనియర్ అభిమానులు. నాడు జూనియర్ ఎన్టీఆర్ ని పిలవాలనే బుర్ర ఎక్కడికిపోయిందని… చంద్రబాబు ఎత్తుకుపోయాడా – లోకేష్ తన్నుకుపోయాడా అని నిప్పులు చెరుగుతున్నారంట. దీంతో హైదరబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు పిలిచేది లేదని ముందుగానే జూనియర్ కి పరోక్షంగా హింట్ ఇచ్చి.. అప్పుడు ఆయన బర్త్ డే కూడా అవ్వడం వల్ల వేరే ప్లాన్ చేసుకునేవరకూ వెయిట్ చేసి.. అది ఫిక్సయ్యిందని తెలిసిన తర్వాత వెళ్లి.. చుట్టం చూపుగా పిలిచిన వీరి నాటకాలు బయటపడ్డాయని కామెంట్లు వెలుస్తున్నాయి.

దీంతో… జూనియర్ పై చంద్రబాబు అక్కసు ఏపీలో ఒకలా తీర్చుకుంటే… హైదరబాద్ లో మరోలా తీర్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో జనార్ధన్ ని ఒక ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. జూనియర్ పై బురదజల్లే బ్యాచ్ లో జనార్ధన్.. మేనేజ్ మెంట్ కోటాలో న్యూ జాయినింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు!