బిగ్ క్వశ్చన్: పూజలు సరే… ప్రమాణం చేస్తారా?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబునాయుడు జ్యుడీషియల్ రిమాండ్‌ పై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన బయటికి రావాలని చెబుతూ… నిజం గెలవాలి అంటూ నారా భువనేశ్వరి యాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో… తాము కోరుకునేది కూడా నిజం గెలవాలనే అని కామెంట్ చేస్తున్న వైసీపీ నేతలు తాజాగా ఒక ఛాలెంజ్ విసిరారు.

అవును… తన భర్త చంద్రబాబు అవినీతి చేయలేదని నారా భువనేశ్వరి ప్రమాణం చేస్తారా అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం సవాల్‌ విసిరారు. ఇదే సమయంలో ఈ మేరకు నారా భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేసి “నిజం గెలవాలి” యాత్ర ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రాథమిక ఆధారాలు ఉండటం వల్లే న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు!

ఇదే సమయంలో… నిజం గెలవాలంటే తమ ఆస్తుల మీద విచారణకు భువనేశ్వరి సిద్ధమా అని మరో చాలెంజ్‌ చేశారు రఘురాం. ఇదే క్రమంలో… భవిష్యత్‌ లేని లోకేష్‌.. “భవిష్యత్‌ కి గ్యారంటీ” యాత్ర చేస్తే ఏం లాభమని తలశిల రఘురాం ప్రశ్నించారు. నారా లోకేష్‌ ఏ యాత్ర చేపట్టినా మధ్యలో ఆగిపోతుందని జోస్యం చెప్పిన ఆయన… యువగళం పాదయాత్ర చేపట్టి దానిని మధ్యలోనే ఆపేస్తాడని తాను ఎప్పుడో చెప్పినట్లు తెలిపారు.

ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో… టీడీపీ – జనసేన పొత్తు అధికారికంగా పొడిచిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యలో ఇప్పుడు రెండు పార్టీలతో కూడిన ఈ పొత్తును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత లోకేష్ – పవన్ లపై ఉంది! దీంతో… ఒక చోట ఓడిన లోకేష్‌.. రెండు చోట్ల ఓడిన పవన్‌ ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు రఘురాం.

ఇదే సమయంలో మరిముఖ్యంగా… విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ.. తాను జైల్లో లేనని పేర్కొంటూ.. చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖపై సమగ్రమైన విచారణ జరగాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తాడని, ఈ విషయం రిటైర్డ్‌ జడ్జిలే చెప్పారని గుర్తుచేశారు. అదేవిధంగా… లోకేష్‌ ఢిల్లీ వెళ్లి అమిత్‌ షాని ఎందుకు కలిశారో చెప్పాలని ఈ సందర్భంగా తలశిల రఘురాం డిమాండ్‌ చేశారు.

కాగా… అత్యంత ఘనంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను మధ్యలోనే ఆపేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెప్టెంబరు 9న చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేసే నాటికి కోనసీమ జిల్లాలో సాగుతుంది యువగళం పాదయాత్ర. నాడు రాజోలు మండలం పొదలాడలో ఆగిన ఆ యాత్ర పునఃప్రారంభానికి నోచు కోలేదు!