ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘జీవో నెం.1’ తెచ్చింది.. ఈ ఏడాది మొట్టమొదటి రోజునే. అదే, రోడ్లపై ‘రాజకీయ ప్రదర్శనలు’ లేకుండా చేసేందుకు ఉద్దేశించిన జీవో. ఆ జీవో మీద కోర్టును ఆశ్రయించడం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ జీవోని తాత్కాలికంగా సస్పెండ్ చేయడం తెలిసిన విషయాలే.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, అక్కడ ఊరట దక్కలేదు. దాంతో, ఇటు హైకోర్టు మొట్టికాయ.. అటు సుప్రీంకోర్టు మొట్టికాయ.. అంటూ విపక్షాలు సంబరపడ్డాయి. అధికార వైసీపీ గుస్సా అయ్యింది. సర్వోన్నత న్యాయస్థానం సూచనల నేపథ్యంలో, రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించింది జగన్ సర్కారు.
కాగా, జీవోపై హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు, సంబంధిత గడువు పూర్తవడంతో, గడువు పొడిగింపు కోసం పిటిషన్ దారులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అందుకు హైకోర్టు సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ రచ్చ మొదలైంది. ఈసారి విపక్షాలకు మొట్టికాయలంటూ అధికార పార్టీ సంబరపడుతోంది.
అన్నట్టు, మొన్నటి బోగి పండగ మంటల్లో జీవో కాపీల్ని విపక్షాలు తగలబెట్టిన సంగతి తెలిసిందే. కానీ, రేపట్నుంచి ఆ జీవో అమల్లోకి రాబోతోంది. జీవోపై తాత్కాలిక సస్పెన్షన్ పొడిగించలేదు గనుక, జీవో ప్రకారం నిబంధనలు అమల్లో వుంటాయన్నమాట.. రోడ్లపై రాజకీయ ప్రదర్శనలకు సంబంధించి.
మరోపక్క, రేపు ఈ కేసు విషయమై హైకోర్టులో విచారణ కొనసాగనుంది. రేపటి వానలు ఎలా వుంటాయో, హైకోర్టు ఎలా స్పందిస్తుందో.! ఒకవేళ జీవో కొట్టివేత దిశగా హైకోర్టు స్పందిస్తే, ప్రభుత్వానికి మొట్టికాయ అన్నట్టు.. లేదంటే, విపక్షాలకు మొట్టికాయ అన్నట్టు. మొట్టికాయ మాత్రం కామన్.! వెరసి, రాష్ట్రమే మొట్టికాయల మయం అయిపోయినట్లుంది.! ఇదెక్కడి రాజకీయం.? దేశంలో ఎక్కడన్నా వుందా ఇలా.?