చంద్రబాబుకు షాకులిస్తున్న సుజనా

చంద్రబాబునాయుడుకు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి షాకులిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత బహిరంగంగా చంద్రబాబును తప్పు పట్టిన నేతలు ఎవ్వరూ లేరు. అలాంటిది సుజనా మాత్రం చంద్రబాబును తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. అదికూడా మీడియాతోనే మాట్లాడటం విచిత్రంగా ఉంది.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమికి చాలా కారణాలే ఉన్నట్లు సుజనా స్పష్టంగానే చెప్పేశారు. సన్నిహిత కోటరీలోని నేతలే చంద్రబాబును తప్పదోవ పట్టించారట. ఎన్డీఏతో కటీఫ్ చెప్పి దూరంగా జరగటం మొదటి తప్పుగా చెప్పారు. బిజెపితో కటీఫ్ చెప్పకుండా ఉండుంటే మొన్నటి ఎన్నికల్లో టిడిపి మళ్ళీ గెలిచేదే అంటూ చెప్పటం విశేషం.

పోయిన ఎన్నికల్లో బిజెపి, పవన్ కల్యాణ్ వల్లే టిడిపికి అధికారం వచ్చిందని చెబుతూనే మొన్నటి ఎన్నికల్లో  ఆ రెండు అంశాలు పక్కన లేకపోవటం కూడా కారణంగా చెప్పారు. ఎంఎల్ఏల అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు. నేతల అవినీతిని నియంత్రించలేకపోవటం, జన్మభూమి కమిటిలు మాఫియాల్లాగ తయారవ్వటం, అవినీతి ఆరోపణలున్న వారికే మళ్ళీ టిక్కెట్లు ఇవ్వటం లాంటి అనేక కారణాలను వివరించారు.

గడచిన 20 ఏళ్ళుగా టిడిపి జెండానే ఎగరని మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయటం పెద్ద తప్పుగా చెప్పారు. చాలా కాలంగా పార్టీలో తన యాక్టివిటీ తగ్గిపోయిందన్నారు. సుజనా చెప్పిన చివరి విషయంతో ఆయన బిజెపిలోకి వెళ్ళిపోతారా ? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి పార్టీలో.  ఏదేమైనా తొందరలో సుజనా నుండి చంద్రబాబుకు మరిన్ని షాకులు తప్పేట్లు లేదు.