న్యాయస్థానంలో వాడి, వేడిగా వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వం తరఫు వాదనలు, చంద్రబాబు తరఫు వాదనలు.. వెరసి, తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలస్మెంట్ కేసులో అరెస్టయి జైల్లో వున్న సంగతి తెలిసిందే.
ఇదొక అర్థం పర్థం లేని కేసు అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. ఈ స్కామ్ సూత్రధారి చంద్రబాబేనంటూ ప్రభుత్వం తరఫున వాదనలు కూడా ఘాటుగా సాగాయి. ఈ క్రమంలో పలు కేసుల్ని ఉదాహరణలుగా ఇరు పక్షాలూ పేర్కొన్నాయి.
ఇటీవలి కాలంలో, ఏ కేసు గురించీ ఈ స్థాయిలో చర్చ జరగలేదు. ఇరు పక్షాలూ, జాతీయ మీడియా దృష్టికి ఇప్పటికే ఈ కేసుని తీసుకెళ్ళిన దరిమిలా, జాతీయ స్థాయిలో.. ఈ రోజు కోర్టు పరిణామాల గురించి ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు కడిగిన ముత్యంలా ఈ రోజే జైలు నుంచి బయటకు వస్తారనీ, ప్రభుత్వం వేసిన తప్పుడు కేసు కొట్టివేయబడుతుందని టీడీపీ శ్రేణులు బలంగా నమ్మాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకి ఊరట దక్కే అవకాశమే లేదని వైసీపీ శ్రేణులు అంతకన్నా ధీమాగా వున్నాయి.
వాదోపవాదాల్ని విన్న న్యాయస్థానం, ‘వాదనలు ముగిసినట్లుగా’ ప్రకటించి, తీర్పుని రిజర్వ్ చేసింది. రెండ్రోజుల్లో ఈ కేసులో తీర్పు వచ్చే అవకాశం వుంది. ఆ తీర్పు చంద్రబాబుకి అనుకూలమా.? వ్యతిరేకమా.? అన్నదానిపై మళ్ళీ చర్చోపచర్చలు మామూలే.
కేసులో అసలు పస లేదు గనుక, కొట్టేయాలన్నదాని చుట్టూనే వాదనలు జరిగాయి. ఇరు పక్షాల తరఫు నుంచీ అత్యంత ఖరీదైన లాయర్లను మోహరించడం గమనార్హం.