ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారో గానీ.. కొన్ని అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం అయ్యాయి. అలాంటి అనూహ్య సంఘటనలు తన పాదయాత్ర వల్ల చోటు చేసుకుంటాయని జగన్ కూడా ఊహించి ఉండరు. ఆయన ఏ ఉద్దేశంతో పాదయాత్రను మొదలు పెట్టారో..దాన్ని ఆయన దిగ్విజయంగా అందుకున్నారు. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, న్యాయ పరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వాటిని ఛేదించి, ఆయన లక్ష్యాన్ని అందుకున్నారు.
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో.. కాస్త ఘాటుగా చెప్పాలంటే గడ్డు స్థితుల్లో జగన్ తన తొలి అడుగు వేశారు. చివరి అడుగు పూర్తయ్యే సరికి.. రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అంటే పూర్తిగా తలకిందులయ్యాయి. 2017 నవంబర్ 6న సొంత జిల్లా కడపలోని ఇడుపుల పాయలో తన తండ్రి సమాధి జగన్ వేసిన తొలి అడుగు.. ఓ రకంగా రాష్ట్ర రాజకీయాలను శాసించింది. 40 ఏళ్ల అనుభవం ఉందంటూ చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా అధః పాతాళానికి తొక్కేసింది. జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను తలకిందులు చేసిందని అనడం కంటే చంద్రబాబును శాసించిదని చెప్పుకోవడమే కరెక్ట్. ఎందుకంటే- ఓ దశలో జగన్ ఆదేశిస్తూ పోయారు.. దాన్ని తు.చ తప్పకుండా చంద్రబాబు పాటించారు. దీనికి నిదర్శనలు ఎన్నో ఉన్నాయి.
ఇడుపుల పాయలో జగన్ తొలి అడుగు వేసే సమయానికి చంద్రబాబు ప్రభ దేదీప్యమానంగా వెలిగింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇద్దరు కేంద్రమంత్రులను కూర్చోబెట్టారు. `అనుకూల మీడియా కథనం ప్రకారం` చెప్పాలంటే- ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పే స్థితిలో ఉన్నారు.
ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉన్న రాష్ట్ర ఖజనాను ఏ మాత్రం లెక్క చేయకుండా పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ప్రతి ఆరునెలలకోసారి ప్రత్యేక విమానంలో విదేశాలను చుట్టే వచ్చే స్థితి ఆయనది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వంటి నాయకుడు ప్రపంచంలోనే లేరంటూ నిండు సభలో కొనియాడిన పరిస్థితులు ఆయనవి. సింగపూర్, చైనా, జపాన్, బ్రిటన్, తజకిస్తాన్, శ్రీలంక.. అంటూ కాలు కింద పెట్టకుండా, పరిపాలనను గాలికి వదిలేసి తాను ప్రత్యేక విమానంలో మందీ మార్బలాన్ని వేసుకుని గాలిలో చక్కర్లు కొట్టారు.
ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం అడిగిందే తడవుగా.. విదేశాంగ మంత్రిత్వశాఖ ఆయన పర్యటనలకు అనుమతులు ఇస్తూ వెళ్లింది. దేశంలో ఉన్న 29 మంది ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరు కూడా చంద్రబాబులా విదేశాలను చుట్టి రాలేదు. అయినప్పటికీ.. ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి.
ప్రత్యేక హోదా అంటూ నినదించిన ప్రతిపక్ష నాయకులను చులకనగా చూశారు. హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలై పోయాయా? అని శాసన సభలో ఎద్దేవా చేశారు. హోదా అడిగితే జైలులో పెట్టిస్తానని హెచ్చరించారు.ఏ రాష్ట్రానికి రానన్ని నిధులను సాధించామని ప్రకటించుకున్నారు. ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటిస్తే.. రాత్రి 10 గంటల సమయంలో హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ దాన్ని స్వాగతించారు.
ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమరావతి నిర్మాణానికి హాజరైన ప్రధానమంత్రి చెంబెడు నీళ్లు, పిడికెలంత మట్టి మూట చేతికి ఇస్తే.. దాన్ని కళ్లకు అద్దుకుని అందుకున్నారు చంద్రబాబు. నవ నిర్మాణ దీక్ష అంటూ కాంగ్రెస్‌పై, పిల్ల కాంగ్రెస్ అంటూ వైఎస్ఆర్ సీపీపై ఇష్టానుసారంగా ఆరోపణలు గుప్పించారు.
ఇదీ `క్లుప్తంగా` చంద్రబాబు వెలిగిన ఓ వెలుగు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసే సరికి చంద్రబాబు ఏ దుస్థితిలో పడిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాదయాత్రకు అసంఖ్యాకంగా పెరుగుతున్న ప్రజా మద్దతును ఆయన ముందే పసిగట్టారు. దీనికోసం రాజ్యంగ సంస్థలను ఆయన తన స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారు.
ఇక తన `మార్క్` రాజకీయాలు చేయకపోతే భవిష్యత్తు ఉండదనుకున్నారో, ఏమో ఒక్కసారిగా మాట మార్చారు. నాలుకను మెలి తిప్పారు. యూ టర్న్ తీసుకున్నారు. హోదా వద్దని తాను ఏనాడూ చెప్పలేదని అచ్చమైన అబద్ధం ఆడారు. హోదా కావాలంటూ ఓ పది గంటల పాటు నిరశన దీక్షకు దిగారు. దానికి ధర్మ పోరాట దీక్ష అని నామకరణం చేశారు. ఇది ఫక్తు చంద్రబాబు మార్క్ రాజకీయం.
45 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాటనూ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పాటించారు. ప్రత్యేక హోదా ఎందుకంటూ ఎద్దేవా చేసిన చంద్రబాబే.. హోదా తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా తానూ అదే డిమాండ్‌ను నెత్తికెత్తుకోవాల్సిన దుస్థితి. దీనితో ఆయన ఒక్కసారిగా `యు టర్న్ అంకుల్`గా గుర్తింపు పొందారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకున్నారు. ఇది కూడా ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేకుండా జరిగిన పరిణామమే.
రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. `కేంద్రంపై అవిశ్వాసాన్ని పెట్టగలిగే దమ్ము మాకు ఉందం`టూ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే.. చంద్రబాబు తానూ అదే పని చేశారు. అదీ జగన్ మాటతోనే సాధ్య పడింది.
ఏ కాంగ్రెస్ అయితే రాష్ట్రాన్నిసర్వ నాశనం చేసిందంటూ చంద్రబాబు 2014 ఎన్నికల ద్వారా లబ్ది పొందారో అదే కాంగ్రెస్ పంచన చేరాల్సిన ఆగత్యం చంద్రబాబుకు ఏర్పడింది. దీనికీ జగనే కారకుడు. ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేరనే విమర్శను ఆయన నిజం చేశారు. కాంగ్రెస్ పొత్తుకు చంద్రబాబు `చారిత్రక అవసరం`గా కలరింగ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
`చచ్చామో, బతికామో చూడ్డానికి వస్తున్నారా?` అంటూ గతంలో రాహుల్ గాంధీపై హూంకరించిన చంద్రబాబు అదే రాహుల్‌తో చేతులు కలిపిన ఘట్టం.. జగన్ పాదయాత్ర వల్లే చోటు చేసుకుంది. చివరికి రాహుల్‌ను ఉద్దేశించి చేసిన ఘాటు కామెంట్లను మోడీకి సంధించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు అనైతిక రాజకీయానికి పాల్పడ్డారు.
అంతకుముందు- మోడీకి శాలువా కప్పిన చేతులతోనే రాహుల్‌కు శాలువా కప్పిన దయనీయ స్థితికి చేరుకున్నారాయన. పిల్ల కాంగ్రెస్ అంటూ వైఎస్ఆర్ సీపీపై ఎదురుదాడికి దిగిన చంద్రబాబు.. చివరికి తానే పిల్ల కాంగ్రెస్‌గా అవతరించారు. ఈ ఘటన కూడా జగన్ పాదయాత్రదే.
`నవ నిర్మాణ దీక్ష`లను చంద్రబాబు మరిచే పోయారు. వాటి స్థానంలో `ధర్మ పోరాట దీక్ష`లంటూ సరికొత్త డ్రామాలకు తెర తీశారు. జనాన్ని మోసగించడానికి ఏ పేరైతే ఏముందిలే? అనుకునే స్థాయికి దిగజారారు. బీజేపీ ఒడిలో కూర్చుని కాంగ్రెస్‌ను తిడితే నవ నిర్మాణ దీక్ష అని పేరు.. కాంగ్రెస్ పంచన చేరి బీజేపీని తిడితే ధర్మ పోరాట దీక్షలా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. అయినప్పటికీ చంద్రబాబు దులుపుకొని పోయారే తప్ప ఆత్మ విమర్శ చేసుకోలేదు. పైగా- తాను చేసిన తప్పులను, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేశారు.
అన్ని రకాలుగా ఇది చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘన విజయం. చిరస్మరణీయమైన గెలుపు. చంద్రబాబును ఎన్డీఏ నుంచి బయట పడేయడం, ఇటలీ మాఫియా అంటూ తిట్టిన నోటితోనే సోనియా, రాహుల్ గాంధీల నామాన్ని స్మరించేలా చేయడం జగన్ విజయం కాక మరేమిటి?
ఈ విజయం ఒక్క చంద్రబాబు మీదే కాదు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి నాయకుడిపై, ప్రతి కార్యకర్తపై, ప్రతి అభిమానిపై జగన్ సాధించిన నైతిక విజయమే ఇది. తాము సొంతంగా ఆలోచించలేమని, చంద్రబాబు ఏది చెబితే, దాన్నే అనుసరిస్తామని టీడీపీ నాయకులు, అభిమానులు రుజువు చేశారు. చంద్రబాబును భుజాన మోస్తున్న అనుకూల మీడియాపైనా జగన్ సాధించిన తిరుగులేని విజయం ఇది.