అలాగే ఉంది విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ బోండా ఉమామహేశ్వరరావు మాటలు వింటుంటే. తెలంగాణా ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఏపిలో కూడా తెలుగుదేశంపార్టీకి 150 సీట్లు రావటం ఖాయమట. తెలంగాణా ఎన్నికల్లో ప్రజలు సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేశారట. ప్రధానమంత్రి నరేంద్రమోడి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల ప్రచారాన్ని తిప్పికొట్టారట. కాబట్టే టిఆర్ఎస్ అఖండ విజయం సాధించిందని బోండా చెప్పటం విచిత్రంగానే ఉంది. ఏపిలో కూడా తెలంగాణాలో లాగే సేమ్ టు సేమ్ ఫలితాలు వస్తాయట. ఎలాగయ్యా అంటే దేశంలో మరెక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయట. మోడి, అమిత్ షాలు కక్ష కట్టారట. కాబట్టి ఏపి ఓటర్లు కూడా బిజెపికి తగిన బుద్ది చెబుతారట.
ఎలాగుంది బోండా లాజిక్. బోండా ఉమామహేశ్వరరావు మాటలు వింటుంటే తెలంగాణా ఎన్నికల ఫలితాలతో ఏదో అయ్యిందన్న అనుమానాలు రావటం లేదూ. అంటే ఇదే లక్షణాలు చంద్రబాబునాయుడులో కూడా కనబడుతున్నాయనుకోండి అది వేరే సంగతి. ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు స్పందన విన్నవారికి కూడా అదే అనుమానాలు మొదలయ్యాయి. తెలంగాణాలో తనకు ఎదురైన పరాభావాన్ని గురించి చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల్లో బిజెపికి, ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారంటూ చెప్పటమే విచిత్రంగా ఉంది.
చంద్రబాబు పద్దతిలోనే బోండా కూడా నడుస్తున్న విషయం స్పష్టమైపోతోంది. ఏపిని మోసం చేసిన మోడికి 2019లో ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారట. మూడు రాష్ట్రాల్లో ఓడిపోవటమే అందుకు సాక్ష్యమట. అంత వరకూ ఓకేనే. మోడి నియంతృత్వ పాలనతో జనాలు విసిగిపోయారట. అందుకే తెలంగాణాలో మోడి, షాలు ప్రచారం చేసినా దక్కింది ఒక్క స్ధానమే అన్నారు. అంత వరకూ నిజమే. కానీ ఆ తర్వాత చెప్పిన మాటలే విడ్డూరంగా ఉంది. బిజెపితో రహస్య ఒప్పందం చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రజలు బుద్ది చెబుతారట.
అంటే నాలుగేళ్ళ పాటు బిజెపితో చంద్రబాబు అంటకాగిన విషయాన్ని జనాలు మరచిపోతారని బహుశా బోండా ఉద్దేశ్యం కాబోలు. 2019లో వైసిపి అడ్రస్ గల్లంతవటం ఖాయమట. ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకే పట్టం కట్టిన విషయం అర్ధమైపోతోంది కాబట్టి ఏపిలో కూడా వచ్చే ఎన్నికల్లో టిడిపిదే విజయమంటున్నారు. అప్పటికేదో ఏపిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగిపోతోందనే కలరింగ్ ఇస్తున్నారు బోండా. తాజాగా బోండా మాటలు విన్న వారికి ఏమర్ధమవుతోంది ?