స్కిల్ డెవలప్మెంట్ స్కామ్.! సీఐడీ కస్టడీ తర్వాతేంటి.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కి సంబంధించి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి తొలి రోజు సీఐడీ కస్టడీ ముగిసింది. సీఐడీ అధికారుల బృందం, సుదీర్ఘంగా ఈ కేసుకి సంబంధించి చంద్రబాబుని, రాజమండ్రి కేంద్ర కారాగారంలో విచారించింది. విచారణ ప్రక్రియ మొత్తాన్నీ వీడియోలో చిత్రీకరించారట.

రేపు రెండో రోజు కూడా సీఐడీ కస్టడీ విచారణ జరుగుతుంది. దాంతో, రెండ్రోజుల కస్టడీ వ్యవహారం ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది.? ఇంతకీ, కస్టడీలో విచారణ సందర్భంగా చంద్రబాబు పెదవి విప్పారా.? లేదా.? ఈ విషయాలపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు.

విచారణకు చంద్రబాబు సహకరించడంలేదని ఏపీ సీఐడీ గనుక కోర్టుని ఆశ్రయిస్తే, కస్టడీని పొడిగించేందుకు ఆస్కారముంది.. అదీ న్యాయస్థానం, సీఐడీ వాదనలతో ఏకీభవిస్తేనే. కాని పక్షంలో, చంద్రబాబుకి మళ్ళీ కస్టడీకి ఇచ్చే అవకాశమే వుండదు. అలాంటప్పుడు, చంద్రబాబు ఎన్ని రోజులు రిమాండ్ ఖైదీగా వుండాల్సి వస్తుందిట.?

సోమవారం, సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున దాఖలైన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశాలున్నాయి. హైకోర్టులో దక్కని న్యాయం, సుప్రీంకోర్టులో తమకు దక్కుతుందని టీడీపీ అంటోంది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే న్యాయమంటోంది వైసీపీ. ఈ క్రమంలో సోమవారం జరగబోయే వ్యవహారాలపై తెలుగునాట ఒకింత ఉత్కంఠ నెలకొంది.

ఈ కేసులో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో, ఎక్కడ వున్నాయో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు, చంద్రబాబు మీద ఆరోపణలు నిలబడే అవకాశమూ లేదన్నది న్యాయ నిపుణుల వాదన. అలాంటి ఆధారాల్లేకపోతే, చంద్రబాబు ఇన్ని రోజులు జైల్లో ఎలా వుంటారన్నదీ ఇంకో వాదన. ఎవరి గోల వారిదే.!