జగన్ కు నోటీసులు..త్వరలో విచారణ..న్యాయపరమైన చర్యలు

హత్యాయత్నానికి గురైన జగన్మోహన్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొన్న 25వ తేదీన హైదరాబాద్ కు రావటానికి విశాఖపట్నం లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం  తెలిసిందే. సెల్ఫీ తీసుకుంటానని దగ్గరకు వచ్చిన శ్రీనివాస్ అనే యువకుడు హఠాత్తుగా జగన్ పై కత్తితో దాడి చేశాడు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే పక్కకు తప్పుకోవటంతో గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద దిగింది. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.

హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. తర్వాత ఘటనపై విచారణ కోసం చంద్రబాబునాయుడు సిట్  (స్పెషల్ ఇన్వెస్టుగేషన్ టీమ్ )ను ఏర్పాటు చేశారు.  ఉన్నతాధికారి నాగేశ్వరరావు నాయకత్వంలో సిట్ పనిచేస్తోంది. తమ విచారణలో భాగంగానే రెండు రోజులుగా నిందితుడు శ్రీనివాస్ ను విచారిస్తోంది. ఆ సిట్ అధికారులే తాజాగా జగన్ కూడా నోటీసులు జారీ చేశారు. తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి జగన్ ఏం చెబుతారనే విషయంలో స్టేట్మెంట్ తీసుకునేందుకు జగన్ కు నోటీసులిచ్చారు.

విచారణలో భాగంగా త్వరలో జగన్ ను పిలిపించాలని సిట్ నిర్ణయించింది. మరి జగన్ ను ఎప్పుడు పిలిపించాలనే విషయంలో డాక్టర్ల సూచనలను కూడా సిట్ పరిగణలోకి తీసుకుంటోంది.  ఒకవేళ జగన్ గనుక సిట్ విచారణకు తిరస్కరిస్తే న్యాయపరంగా ముందుకెళ్ళాలని కూడా నిర్ణయించారు. ఎందుకంటే, రాష్ట్రప్రభుత్వం జరిపించే విచారణపై తమకు నమ్మకం లేదని ఇప్పటికే జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్ధతో కానీ లేకపోతే జ్యుడీషియల్ విచారణను కానీ వైసిపి కోరుకుంటోంది. అయితే, వైసిపి డిమాండ్ నెరవేరాలంటే ఇటు హై కోర్టు కానీ అటు కేంద్రం కానీ సానుకూలంగా స్పందించాలి. ఈలోగానే తమ  దర్యాప్తును పూర్తి చేయాలని సిట్ అనుకుంటోంది. అందుకే త్వరలో జగన్ కు నోటీసులిచ్చే అవకాశం ఉంది. మరి నోటీసులపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.