కడప జిల్లా సర్వేలో చంద్రబాబుకు షాక్

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా తెలుగుదేశంపార్టీనే గెలుస్తుంది…ఇది చంద్రబాబునాయుడు నోటి వెంట తరచూ వచ్చే ప్రకటన.  కానీ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో చంద్రబాబుకు షాక్ కొట్టే ఫలితాలు వచ్చాయట. అదికూడా చంద్రబాబుకు బాకా ఊదే ఓ మీడియా నిర్వహించిన సర్వేలోనే కావటం గమనార్హం. చంద్రబాబు చెప్పేదెలాగ ఉంటుందంటే, పులివెందులలోనే టిడిపి గెలుస్తుందంటే జిల్లాలోని మొత్తం సీట్లు తమ ఖాతాలోనే పడతాయని చెబుతున్నట్లుంటుంది. సరే చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి మంత్రులు,నేతలు కూడా అవే పలుకులు పలుకుతున్నారు. కానీ లేటెస్టుగా చంద్రబాబుకు మద్దతుగా నిలబడే ఆంధ్రజ్యోతి ఓ సర్వే నిర్వహించిందట. అందులో దిగ్ర్భాంతి చెందే విషయాలు బయటపడ్డాయని సమాచారం.

 

జిల్లాలో టిడిపి పరిస్ధితిపై సర్వే నిర్వహించటమే కాకుండా జిల్లాలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితిని వివరిస్తూ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. దాని ప్రకారం జిల్లాలో టిడిపికి ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాదని ఎవరికి వారుగా అర్ధం చేసుకోవాలి. ఒక్క అసెంబ్లీలో కూడా గెలవకపోతే ఇక రెండు పార్లమెంటు సీట్లు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సదరు మీడియాలోని కథనం ప్రకారం జిల్లాలోని ప్రతి సీటులోనే నేతల మధ్య విభేదాలు చాలా తీవ్రస్ధాయిలో ఉన్నాయి. పోయిన ఎన్నికల్లో ముక్కి మూలిగి టిడిపి రాజంపేట అసెంబ్లీలో మాత్రం గెలవగలిగింది. అటువంటిది వచ్చే ఎన్నికల్లో ఆ రాజంపేట సీటులో గెలవటం కూడా కష్టమే అన్నట్లుగా కథనంలో స్పష్టమవుతోంది.

 

రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డికి నియోజకవర్గంలో వ్యతిరేకత బాగా పెరిగిపోయిందట. నియోజకవర్గంలోని నేతలు పసుపులేటి బ్రహ్మయ్యతో గొడవలు తీవ్రస్ధాయిలో ఉండగానే కొత్తగా పత్తిపాటి కుసుమకుమారి కూడా ఎంఎల్ఏపై యుద్ధం మొదలుపెట్టారు. దాంతో నియోజకవర్గంలోని క్యాడర్ మూడు ముక్కలైపోయింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు మళ్ళీ మేడాకే ఇస్తే గెలవడని రెండు వర్గాలు విడివిడిగా చెప్పాయట. అదికూడా మంత్రులతో మేడా ముందే చెప్పటం కొసమెరుపు.

 

ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమాత్రం ప్రజాబలం లేని సిఎం రమేష్ కు మిగిలిన నేతలతో అస్సలు పడటం లేదు. మాజీ ఎంఎల్ఏ వరదరాజులరెడ్డితో బద్ద వైరం కొనసాగుతోంది. ఇక జమ్మలమడుగులో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి పరిస్ధితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అదేవిధంగా కమలాపురం, మైదుకూరు, కడప, బద్వేలు, రాయచోటి, కోడూరులో గ్రూపుల గోల ఎక్కువైపోయిందని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే పులివెందులలో గ్రూపుల గోల కాస్త నయమట. హోలు మొత్తం మీద చూస్తే అర్ధమవుతున్నదేమిటంటే జిల్లాలో వైసిపి 10కి 10 సీట్లు స్వీప్ చేస్తుందని. సర్వే + కథనం చూసిన తర్వాత చంద్రబాబుకు షాక్ కొట్టకుండా ఎలాగుంటుంది ?