కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి అధిష్టానం షాకిచ్చింది. తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో శశిధర్ రెడ్డి పేరు లేదు. ఈ జాబితాలో తన పేరు లేకపోవడం పై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సనత్ నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటి చేస్తున్నారని టిటిడిపి అధికారికంగా ప్రకటించింది.
మూడో జాబితాలో తన పేరు లేకపోవడం బాధాకరమన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తానన్నారు. మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం పై వేసిన కేసులలో సగం మర్రి శశిధర్ రెడ్డే వేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో మర్రి శశిధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కోర్టులలో వ్యతిరేకత వచ్చినా కూడా ఆయన తన స్వరాన్ని వినిపించారు. అటువంటి నేతకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు.
మర్రి శశిధర్ రెడ్డి ఆశిస్తున్న సనత్ నగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించింది. 2014లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 27,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు శశిధర్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ తరపున తలసాని బరిలో ఉన్నారు.
నామినేషన్లకు తక్కువ సమయం ఉండటంతో శశిధర్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో అని చర్చనీయాంశంగా మారింది. మరో వైపు కాంగ్రెస్ పెద్దలు కూడా శశిధర్ రెడ్డికి సర్ధి చెప్పేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.