బ్రేకింగ్ న్యూస్ : రావెల రాజీనామా..చంద్రబాబుకు షాక్

చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే తగిలింది. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎంఎల్ఏ పదవికి కూడా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రావెల రాజీనామా ఎప్పటి నుండో ఊహిస్తున్నదే. టిడిపికి రాజీనామా చేసిన రావెల జనసేనలో చేరనున్నారు. ఎంఎల్ఏగా రాజీనామా చేయనీకుండా పార్టీలోని కొందరు సీనియర్లు రావెలతో మాట్లాతున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఎవరు మాట్లాడినా వెనక్కు తగ్గేది లేదని రావెల రాజీనామాతో సమాధానం చెప్పినట్లైంది. మంత్రిపదవిలోనుండి రావెలను తప్పించినప్పటి నుండి చంద్రబాబుతో పడటం లేదు. చంద్రబాబు, ప్రభుత్వంపై తన అసంతృప్తిని పార్టీ వేదికలమీదే బాహాటంగానే చూపించారు. దాంతో రావెల ఎంతో కాలం టిడిపిలో ఉండలేరన్న విషయం అర్ధమైపోయింది.

 

వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడులో టిక్కెట్టు కూడా తనకు అనుమానమే అని రావెలకు డౌట్ వచ్చింది. దాంతో వైసిపి వైపు చూశారు. అయితే, టిక్కెట్టు విషయంలో రావెలకు జగన్మోహన్ రెడ్డి నుండి ఎటువంటి హామీ లభించలేదని సమాచారం. ముందు పార్టీలో చేరిన తర్వాత అధికారంలోకి వస్తే సముచిత స్ధానం కల్పిస్తామని మాత్రం జగన్ చెప్పారట. దాంతో రావెల మనసు మార్చుకున్నారు. దాంతో జనసేన వైపు చూశారు.

 

ఎలాగూ జనసేనకు నాయకులు లేరు. అన్నీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి అభ్యర్ధులు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో అందునా ఎస్సీ సామాజికవర్గంలో పాపులరైన రావెల లాంటి నేత జనసేనలోకి వస్తానంటే పవన్ కల్యాణ్ ఎందుకు వద్దంటారు. అందుకే వెంటనే పార్టీలోకి ఆహ్వానించటం, ప్రత్తిపాడులో పోటీ చేయటానికి టిక్కెట్టు కూడా హామీ ఇచ్చేశారట. దాంతో రావెలకు లైన్ క్లియరైంది. డిసెంబర్ 1వ తేదీన విజయవాడలోనే జనసేన కండువా కప్పుకోవటానికి రంగం సిద్ధమైపోయింది.