అయిపాయె.! పవన్ కళ్యాణ్‌కి పిచ్చెక్కిందనేస్తున్నారు.!

రాజకీయాల్లో వున్నోళ్ళు సంయమనంతో వ్యవహరించాలి. అధికారంలో వున్నోళ్ళు ఇంకా ఎక్కువ సంయమనం పాటించాలి. సరే, సంయమనం పాటించకపోతే ఏమవుతుంది.? అంటే, దానిపై ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.. అది వేరే సంగతి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రజల్లో మార్పు రావాలంటున్నారు. కానీ, ఆయన వ్యాఖ్యలు ‘తీవ్రవాదం’ దిశగా జనాన్ని ప్రోత్సహించేలా వున్నాయి. ‘నేను తీవ్రవాదినవుతా..’ అంటూ జనసేన అధినేత తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అసలు ఇలాంటి మాటలకు ఆస్కారం వుందా.?

కింది స్థాయి నాయకులు సైతం మాట్లాడకూడని మాటలివి. ఆయనేమో పార్టీ అధినేత. ఏమయ్యింది పవన్ కళ్యాణ్‌కి.? ఎందుకీ ఫ్రస్ట్రేషన్. సాధారణ ప్రజానీకంలో జనసేన పార్టీ పట్ల కాస్తో కూస్తో సాఫ్ట్ కార్నర్ ఏర్పడే అవకాశం వుంటే.. అది ఇలాంటి మాటలతో మొత్తంగా గల్లంతయిపోతుంది. ‘పవన్ కళ్యాణ్‌కి పిచ్చెక్కింది.. కేఏ పాల్‌కీ పవన్ కళ్యాణ్‌కీ తేడా లేదు.. సన్నాసి మాటలు మాట్లాడుతున్నాడు..’ అంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎందుకీ దుస్థితి.? పవన్ ఎందుకిలా తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు.?

బహుశా జనసేన అధినేతకు, ఓటమిపై ఇంకాస్త స్పష్టత వచ్చినట్లుంది. గెలిచే అవకాశం ఏమాత్రం వున్నా.. పవన్‌లో ఇంత ఆవేశం వుండదు. జనసేనను ఎక్కువగా అభిమానించేవాళ్ళలో మళ్ళీ యువతే కన్పిస్తారు. వారికి జనసేనాని ఏం సందేశం ఇస్తున్నట్లు.?