నటరత్న సార్వభౌమ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సీఎం నందమూరి తారక రామారావు పిఎ శ్రీనివాసరావు మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్ దగ్గర 1985 నుండి 1990 వరకు ఐదేళ్లపాటు వ్యక్తిగత సలహాదారుగా పని చేశారు శ్రీనివాసరావు.
సోమవారం ఖైరతాబాదులోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో మృతి చెందినట్టు తెలుస్తోంది. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం గుండె పోటుతో మరణించారు. కాగా ఆయన పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం అవివాహితుడిగానే ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ వద్ద పిఎ బాధ్యతల నుండి వైదొలగిన తర్వాత పలువురు సినీ ప్రముఖల వద్ద పని చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షులు సి.నారాయణరెడ్డి వద్ద కొన్నాళ్ళు పని చేశారు. ఆ తర్వాత సినీ నటుడు దాహరమవరపు సుబ్రహమణ్యం, ఆర్వీ రమణమూర్తులు వద్ద పిఎగా బాధ్యతలు నిర్వర్తించారు. చివరిదశలో ఆయన ఖైరతాబాద్ లో తన సోదరుడు జి.వి కృష్ణారావు దగ్గరే ఉన్నారు. ఆయనకు సోదరి రాయపాటి దుర్గ కుమారి ఉన్నారు.
కాగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఎ గా పని చేసిన శ్రీనివాసరావు క్యారెక్టర్ కూడా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఆయన మరణించడం బాధాకరం అని సన్నిహితులు వాపోతున్నారు.