వైఎస్ షర్మిలకు సజ్జల వార్నింగ్.! చంద్రబాబు మీదకు నెట్టేసిన వైనం.!

ఘనతలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవీ.. చేతకానితనాలన్నీ చంద్రబాబువీ.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఇలా తగలడ్డాయేంటి.? వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది. అసలు, చంద్రబాబుకి అంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం వైసీపీకి ఏముందంటూ వైసీపీ నేతలు కొందరు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై గుస్సా అవుతున్నారు.

సకల శాఖల మంత్రిగా పేరున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో, ‘మా ఓటర్లు వేరే వున్నారు..’ అనడం అప్పట్లో పెను సంచలనం. సీపీఎస్ రద్దు విషయమై, ‘వైఎస్ జగన్‌కి అవగాహన లేక హామీ ఇచ్చారు’ అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం.

ప్రతిసారీ చంద్రబాబు మీదకు నెట్టేయడం సజ్జల రామకృష్ణారెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అంతే మరి.! లేకపోతే, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరితే, అది చంద్రబాబు ఘనత ఎలా అవుతుంది.? వైఎస్ షర్మిల, కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం వుందంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు విస్తుపోయాయి.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంతకు ముందు వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచి, ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్‌లో చేరిపోయిన సంగతి తెలిసిందే.

ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌ని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనతో, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నారు.

ఇదంతా కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం. పైగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నడిపిస్తున్నదే వైఎస్ జగన్.. అని వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయ్. సరే, చంద్రబాబుకి రేవంత్ రెడ్డి పూర్వకాలంలో శిష్యుడు.. అన్నది వేరే చర్చ.

ఇక్కడ, వైఎస్ షర్మిల విషయంలో చంద్రబాబుని సజ్జల తెరపైకి తీసుకురావడం అత్యంత హాస్యాస్పదం. అన్నట్టు, ‘వైఎస్ వివేకాకి ఏం జరిగిందో తెలుసు కదా.?’ అంటూ షర్మిలకి సజ్జల ఇచ్చిన వార్నింగ్ వివాదాస్పదమవుతోంది. ఉద్దేశ్యం పులివెందుల ఉప ఎన్నిక గురించే కావొచ్చుగానీ, సంకేతం వైఎస్ వివేకా హత్య దిశగా వెళుతోంది. మాట జాగ్రత్తగా మాట్లాడకపోతే వచ్చే సమస్య ఇది.