బీజేపీ పై మరోసారి ఫైర్ అయిన సాధినేని యామిని

టిడిపి అధికార ప్రతినిధి సాధినేని యామిని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పై మరోసారి ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ జివిఎల్ ఒక పిట్టల దొర అంటూ విమర్శించారు. టిడిపి, కాంగ్రెస్ తో మైత్రిపై బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు. కాంగ్రెస్ తో టిడిపి ఎందుకు చేతులు కలపవలసి వచ్చిందో వివరించారు. ఆమె ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటానికి కాంగ్రెస్ కి పోటీగా ఆనాడు ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా స్వార్ధం కోసం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పెట్టుకున్నారని కొందరు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సాధినేని యామిని. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటమే చంద్రబాబు ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

ఏపీపై బీజేపీ చేస్తున్న కుట్రలకు అడ్డుకట్ట వేయటం కోసమే నిన్న చంద్రబాబు ఢిల్లీలో అందరిని కలిసారని వివరించారు. బీజేపీ కుట్రలను ఆపేందుకు అన్ని పార్టీలను కలుపుకుని వెళుతున్నామే తప్ప కాంగ్రెస్ తో కలవటం లేదని తేల్చి చెప్పారు. బీజేపీ త్వరలో ఏపీలో భూస్థాపితం కానుందని బలంగా చెప్పారు. కృష్ణా, గోదావరి నీళ్లు తాగుతున్న బీజేపీ నేతలు అధిష్ఠానానికి భజన చేయటకుండా ఏపీ కోసం పోరాడండి అంటూ సూచించారు.

గుజరాత్ లో ఐక్యతకు నిదర్శనంగా ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర ఒక బోర్డు పెట్టారు. అందులో ఉత్తరాది భాషలతో లిఖించబడింది కానీ దక్షిణాది ఏ భాషా అందులో లేదు. తమిళ్ లో రాసారు కానీ తప్పు దొర్లడంతో అది కూడా తుడిపేసారు. కాగా ఈ వ్యవహారాన్ని తప్పు బట్టారు సాధినేని యామిని. పటేల్ విగ్రహం ద్వారా ఏపీ పై మోడీ కి ఉన్న వివక్ష మరొకసారి రుజువు అయింది అని మండిపడ్డారు ఆమె.