తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్

ఆపద్ధర్మ ప్రభుత్వాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీని రద్దు చేసిన మరుక్షణమే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొంది. మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని తెలిపింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ తెలిపింది.

ఆపద్ధర్మ సీఎంగా విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవద్దంది. కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించకూడదని వెల్లడించింది. అనధికార కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులు వినియోగించ వద్దని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ను రద్దు చేసినా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సహా అన్ని రాష్ర్టాల సీఎస్‌లకు ఈసీ లేఖలు పంపింది.

తెలంగాణ అసెంబ్లీ రద్దయిన తర్వాత కూడా మెట్రో రైలుకు సంబంధించి ప్రారంభ కార్యక్రమంలో కేటిఆర్ పాల్గొని మంత్రి హోదాలో ప్రవర్తించారని, కేసీఆర్ వ్యవహార శైలిగానీ కొన్ని కార్యక్రమాల్లో మంత్రులు  పాల్గొనడం.. తదితర వాటి పై ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఎన్నికల సంఘం ప్రకటనతో తెలంగాణలో ఆపధ్దర్మ ప్రభుత్వం చేపట్టనున్న బతుకమ్మ  చీరల పంపిణీ కూడా నిలిచి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సంక్షేమ పథకం కాదు. అది కేవలం మహిళలకు ఇస్తున్న కానుక మాత్రమే. కాబట్టి ఇది సంక్షేమ పథకం కాదు కావున బతుకమ్మ చీరల  పంపిణీ ఆగుతుండొచ్చనే వార్తలు వస్తున్నాయి. అధికారులతో అనధికార పనులు చేయించొద్దని, కొత్త పథకాలు  ప్రవేశ పెట్టవద్దని ఈసీ  ఆదేశాలు జారీ  చేసింది.