విదేశాల్లో భారతీయుల బ్లాక్ మనీ ఎంతో తెలుసా

విదేశాల్లో భారతీయులు దాచుకున్న బ్లాక్ మనీ ఎంతో తెలుసా ? అక్షరాల రూ 34 లక్షల కోట్లు.  ఈ బ్లాక్ మనీ మొత్తాన్ని భారతీయులు 1980-2010 మధ్య దాచుకున్నది మాత్రమే సుమా. ఇక్కడ బ్యాంకులను కొల్లగొట్టటం, వ్యాపారాల్లో మోసాలు, హవాలా డబ్బు, షెల్ కంపెనీలు పెట్టటం లాంటి అనేక మార్గాల్లో కొందరు బ్లాక్ మనీని విదేశాల్లో దాచుకుంటున్నారు.

విదేశాల్లో ఉన్న నల్లధనం విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని కేంద్రప్రభుత్వమే మూడు సంస్దలను కోరింది. దాంతో ఆ సంస్ధలు రంగంలోకి అందుబాటులో ఉన్న మార్గాల్లో అవకాశం ఉన్నంతలో నల్లధనం వివరాలను సేకరించాయి.  చివరగా మూడు సంస్ధలు వేర్వేరుగా తమ నివేదికలను కేంద్రం ముందుంచాయి.

అధ్యయనాలను పరిశీలించిన కేంద్రప్రభుత్వం ఆ నివేదికలను తాజాగా లోక్ సభలో ప్రవేశపెట్టింది. దాని ప్రకారమే రూ. 34 లక్షల కోట్ల నల్లధనం ఉందని ఓ అంచనా బయటపడింది. బ్లాక్ మనీలో ఎక్కువగా రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మసూటికల్స్, పాన్ మసాలా, గుట్కా, పొగాకు వ్యాపారం, విద్య, సినిమాలు, లిక్కర్ తదితర బిజినెస్ లో పెట్టుబడి పెడుతున్నట్లు బయటపడింది. అయితే దాన్ని అరకట్టే యంత్రాంగమే కనబడటం లేదు.

నిజానికి భారతీయులు దాచుకుంటున్న నల్లధనం అంశం కొత్తేమీ కాదు. స్విస్ బ్యాంకులు, వర్జిల్ ఐల్యాండ్స్, మారిషస్ బ్యాంకులు, కరీబియన్ ఐల్యాండ్స్ లోని బ్యాంకులు, ఆస్ట్రియ లాంటి దేశాల్లోని బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు దాచుకుంటున్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నదే. కాకపోతే ఆ బ్యాంకుల నుండి బ్లాక్ మనీని ఇండియాకు తెప్పించటమే ఎలాగో పాలకులకు తెలీటం లేదు.