మోడీ సర్కారు ఘనత: స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు పెరిగాయ్.!

Modi Govt's Achievement: Black Money In Swiss Banks Increased

Modi Govt's Achievement: Black Money In Swiss Banks Increased

‘మా దెబ్బకి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గాయ్..’ అని కొన్నాళ్ళ క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న విషయం విదితమే. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. 2019 చివరి నాటికి ఆరున్నర వేల కోట్లుగా వున్న డిపాజిట్లు, 2020 చివరి నాటికి 20,700 కోట్లకు చేరుకున్నాయనే ప్రచారం జరుగుతోంది.

గత 13 ఏళ్ళలో ఇదే అత్యధిక డిపాజిట్ల సొమ్ము.. అంటూ వార్తలొచ్చాయి. స్విస్ బ్యాంకుల్లోదంతా నల్లధనమేనని గతంలో స్వయానా బీజేపీనే సెలవిచ్చింది. ఆ నల్లధనాన్ని తిరిగి దేశానికి తీసుకొస్తామనీ, అలా తీసుకొస్తే.. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల దాకా వెయ్యడానికి వీలవుతుందని బీజేపీ చెప్పుకుంది.

ఆ విషయమై అప్పుడప్పుడూ రాజకీయంగా సెటైర్లు కూడా పడుతుంటాయి బీజేపీ మీద విపక్షాల నుంచి. కాగా, పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో నల్ల కుబేరులు వణుకుతున్నట్లుగా బీజేపీ పలు సందర్భాల్లో జబ్బలు చరుచుకుంది. పెద్ద నోట్ల రద్దుతో ఫేక్ కరెన్సీ బెడద, టెర్రరిజం కూడా తగ్గుతాయని సెలవిచ్చింది. కానీ, ఇవేవీ జరగలేదు.

పైగా, స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయ్. అంటే, మోడీ సర్కార్.. గత ఏడేళ్ళుగా జనాన్ని భ్రమల్లో వుంచుతోందనే కదా అర్థం.? ఇదిలా వుంటే, వస్తున్న వార్తా కథనాలపై కేంద్రం, స్విమస్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఆ లెక్కల వివరాలు వెల్లడించాలని కోరింది. అయితే, స్విస్ ప్రభుత్వం.. ఆ లెక్కల్ని వెల్లడిస్తుందా.? గతంలో వెల్లడించిన వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పకుండా, ఇప్పుడీ హడావిడి ఏంటట.?