రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు.! ఏదేదో చేస్తుంటాడు. ఏం చేసినా పబ్లిసిటీ స్టంటే.! ఆయనేదో ‘నిజం’ చెబుతానంటే, అందులో నిజం వుంటుందని ఎవరూ నమ్మరు. తాను చెప్పేది నిజమని రామ్ గోపాల్ వర్మ కూడా నమ్మడు. అదే అతని ప్రత్యేకత. కొందర్ని వెర్రి వెంగళప్పల్ని చేయడం కోసం ఆయనేదో అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటాడంతే.
‘నిజం’ పేరుతో యూ ట్యూబ్ ఛానల్.. అందులో ఇంటర్వ్యూలంటూ, అక్కడికేదో వైసీపీని ఉద్ధరించేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇందుకోసం వర్మకి వైసీపీ నుంచి ‘పే చెక్’ అందుతోందన్నది ఓ ప్రచారం. ఆర్జీవీకి పే చెక్ ఇవ్వడం వల్ల వైసీపీకి ఒనగూడే లాభమేంటి.? ఏమీ వుండదు.. జస్ట్ గుండె సున్నా అంతే.!
సోషల్ మీడియా వచ్చాక.. అందరూ మేధావులే.! ఆర్జీవీ కంటే గొప్పగా తిమ్మిని బమ్మిని చేయగలవాళ్ళు తయారైపోయారు. వీరిని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్స్ అని అంటున్నారు. మీమ్స్ పేజెస్ సంగతి సరే సరి.
ఆర్జీవీ ‘నిజం’ కోసం కొందరు వైసీపీ నేతలు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అదేదో వైసీపీ అనుకూల మీడియా ద్వారా, వైసీపీ తరఫున నాలుగు మంచి మాటలు చెబితే, వైసీపీకి మైలేజ్ పెరుగుతుంది కదా.? అన్న సోయ మాత్రం వుండటంలేదు.
ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం వైసీపీ నాయకులకు ఓ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
