పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ అభిమానం.! ఇది ఆయనిష్టం.!

ఎవర్ని ఎలా అభిమానించాలి.? అన్నది ఆయా వ్యక్తుల ఇష్టాన్ని బట్టి వుంటుంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ని అంతమొందించాలన్నంత అభిమానం బహుశా పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మకి వుందేమో.! లేదంటే, చెప్పాలకున్న మంచి మాటని, చాలా గట్టిగా.. గూబ గుయ్యిమనేలా చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ మీద అభిమానం చాటుకోవాలన్నది రామ్ గోపాల్ వర్మ ఆలోచనేమో.!

‘ఇదీ పవన్ కళ్యాణ్ మీద నాకున్న అభిమానం’ అని అంటుంటారు రామ్ గోపాల్ వర్మ. గతంలో శ్రీరెడ్డితో, పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవిని బూతులు తిట్టించాడు రామ్ గోపాల్ వర్మ. బహుశా, పవన్ కళ్యాణ్ తల్లిని అవమానపర్చేలా కుట్రలు చేయడం కూడా పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మకి వున్న అభిమానమేనేమో.!

రాక్షసానందం అంటాం కదా.? అలా దీన్ని రాక్షసాభిమానం అనుకోవాలేమో. అయితే, రామ్ గోపాల్ వర్మ వల్ల పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కి కొంత మేలు జరుగుతోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల్ని పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు అంత సీరియస్‌గా తీసుకోరు.

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే పవన్ కల్యాణ్‌ని గట్టిగా తిడతాడో, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్త ఉత్సాహం తెచ్చుకుని మరీ, ఆర్జీవీ మీద విరుచుకుపడతారు.. తద్వారా పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా విపరీతమైన ఎలివేషన్ వస్తుంటుంది.

ఈ యాంగిల్‌లో చూస్తే, ఇదో రకమైన వెర్రి అభిమానం అని అనుకోవాలేమో.! అటు ఆర్జీవీకి ఇలాంటి చర్యల ద్వారా పవన్ కళ్యాణ్ వ్యతిరేకుల నుంచి ఆర్థిక లబ్ది చేకూరుతుంది.. ఇంకోపక్క, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అలజడి సృష్టించడం ద్వారా జనసేనను, పవన్ కళ్యాణ్‌ని వారు మరింతగా ఇష్టపడేలా ఆర్జీవీ చేయగలుగుతున్నాడన్నది ఓ వాదన. అంతేనా.? అలాగే అర్థం చేసుకోవాలా ఆర్జీవీని.?