తెలంగాణలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పంచాయతీ పాలకవర్గాల సమయం ఆగష్టులో ముగిసినప్పటికి ఇప్పటికి కూడా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. వీటి పై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

రిజర్వేషన్ల కోసమే ఎన్నికలు ఆపామని కోర్టుకు ప్రభుత్వం తెలపగా జనవరి 10 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియను ముమ్మురం చేసిన తెలంగాణ పభుత్వం ఎట్టకేలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. సర్పంచ్ ల రిజర్వేషన్లకు సంబంధించిన జాబితాను సోమవారం రాత్రి 8 గంటలకు ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలకు 2,113 గ్రామపంచాయతీలు, బీసీలకు 2,345 గ్రామాలు, జనరల్ కు 5,147 గ్రామ పంచాయతీలను కేటాయించారు. షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకు 1281 గ్రామపంచాయతీలు కేటాయించింది. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 గ్రామాలు ఎస్టీలకు కేటాయించారు. మిగతా గ్రామ పంచాయతీల్లో 688 ఎస్టీలకు కేటాయించారు. జిల్లాల వారీగా కూడా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి.   

రిజర్వేషన్లు వివరాలు ఇవే:

  • ఎస్సీలకు – 2,113 గ్రామపంచాయతీలు

  • షెడ్యూల్ ఏరియాలోని ఎస్టీలకు – 1,281

  • వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు – 1,177

  • మిగిలిన గ్రామ పంచాయతీలలో ఎస్టీలకు – 688

  • బీసీలకు – 2,345

  • జనరల్ – 5,147  

 

జిల్లాల వారిగా రిజర్వేషన్ల వివరాలు ఇవే 

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దాని పై మాత్రం క్లారిటి లేదు. జనవరి 10 లోపు ఎన్నికల నిర్వహణ మాత్రం అసాద్యమని తెలుస్తోంది. దీంతో జనవరి మొదటి వారం వరకు నోటిఫికేషన్ విడుదల చేసి  ఎన్నికల నిర్వహణకు కోర్టును సమయం కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

బిసిలకు గతంలో 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కానీ దీని పై కోర్టు రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చింది. దీంతో పాత రిజర్వేషన్లు అయినా దక్కుతాయనుకున్న బిసిలకు  ఈ సారి మొండి చేయి చూపింది. మొత్తంగా చూస్తే 24 శాతం కూడా బిసిల రిజర్వేషన్లు మించలేదు. దీంతో బిసిలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వమే ఉన్న రిజర్వేషన్లు తగ్గించడమేంటని బిసి నేతలు ప్రశ్నిస్తున్నారు. బిసిలకు రిజర్వేషన్లు తగ్గించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.