ఖమ్మం పొమ్మంటుందా… బెజవాడ రమ్మంటుందా?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఖమ్మంలో కంటే ఎక్కువగా ఢిల్లీలోనే ఆమె మకాం ఉండేది! దీనిపై స్థానికంగా ఎన్ని విమర్శలొచ్చినా… ఎంపీని కదా ఢిల్లీలోనే ఉండాలని ఎదురుదాడిచేసేవారామె! ఆ సంగతులు అలా ఉంటే… రాబోయే ఎన్నికల్లో రేణుకా చౌదరి.. ఏపీ నుండి పోటీచేయాలని అనుకుంటున్నారా.. ఖమ్మంలోనే కొనసాగాలనుకుంటున్నారా అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

తెలంగాణలో రోజు రోజుకీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో… ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ టిక్కెట్ రేణుకా చౌదరికి రాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమెను అవుట్ డేటెడ్ పొలిటీషియన్ గా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ… పార్టీ సేవల వరకూ సరే కానీ.. ఎంపీ సీటంటే ఈసారి కష్టమని నేరుగానే చెబుతున్న పరిస్థితి అని తెలుస్తుంది! దీంతో… ఈసారి ఆమె విజయవాడ ఎంపీ సీటుకు పోటీచేసే ఛాన్స్ ఉందని అంటున్నారు!

త్వరలో… ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అన్నీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారధ్యంలోనే నడవబోతున్నాయని తెలుస్తుంది. ఈమేరకు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న పొంగులేటికి ఈ మేరకు రాహుల్ నుంచి ఆఫర్ వచ్చిందని అంటున్నారు. ఖమ్మంలో మెజారిటీ సీట్లన్నీ తాను సిఫార్సు చేసిన వారికే ఇవ్వాలనే పొంగులేటి డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టాణం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్స్ నడుస్తున్నాయి.

దీంతో… ఖమ్మం జిల్లా ఎంపీ సీటును రేణుకకు ఇచ్చే చాన్స్ లేదని, అంత సాహసం పొంగులేటి చేయరనే మాటలు ఖమ్మం కేంద్రంగా బలంగా వినిపిస్తున్నాయి. దీంతో… ఇప్పటికే ఒకసారి విజయవాడలో పర్యటించిన ఆమె కోరినట్లుగానే… ఈసారి ఆమెను ఏపీకి పంపించేయాలని పొంగులేటి వర్గం భావిస్తుందని అంటున్నారు! ఏది ఏమైనా… విజయవాడలో రేణుక రాజకీయం మొదలుపెడితే… ఏపీ రాజకీయాలు ఏ స్థాయిలో వేడెక్కుతాయనేది వేచి చూడాలి!