తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు అన్ని పార్టీల వారు మద్దతు పలకడంతో పోచారం ఎన్నిక లాంఛనమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటి స్పీకర్ ఎన్నిక జరగనుంది. తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా అజ్మీరా రేఖా శ్యాం నాయక్ నామినేషన్ వేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా రేఖా శ్యాం నాయక్ ఎన్నిక దాదాపు ఖరారైందని తెలుస్తోంది.
అజ్మీరా రేఖా నాయక్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేఖా నాయక్ 1974 ఫిబ్రవరి 19న శంకర్ చౌహన్, శ్యామలా దంపతులకు జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే సాగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో హైస్కూల్ విద్య, ఓయూ లో ఎంఏ ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు. 1997 ఆగష్టు 10న శ్యాం నాయక్ ను రేఖా నాయక్ వివాహం చేసుకున్నారు. వీరికి పూజ, అక్షిత్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
రేఖా నాయక్ 2009లో రాజకీయాలలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తరపున మొదటి సారి అసిఫాబాద్ జడ్పీటిసిగా పోటి చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీకి ఆకర్షితురాలై 2013 లో టిఆర్ఎస్ లో చేరారు. 2014లో ఖానాపూర్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటి చేసి టిడిపి అభ్యర్ధి రితేష్ రాథోడ్ పై 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో కూడా రేఖా ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు.
రేఖా నాయక్ కు పార్లమెంటు కార్యదర్శి పదవిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా డిప్యూటి స్పీకర్ పదవికి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ముందుగా ఒప్పుకోకపోయినా కేసీఆర్ తో చర్చించాక డిప్యూటి స్పీకర్ పదవి చేపట్టేందుకు రేఖా నాయక్ ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఎస్టీ సామాజిక వర్గం మరియు మహిళ కావడంతో ఇవన్నీ కలిసొచ్చి రేఖా నాయక్ కు డిప్యూటి స్పీకర్ పదవి వరించనున్నట్టుగా తెలుస్తోంది.