చినబాబు ఖాతాలో మరో వికెట్… మీకర్ధమవుతుందా…?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. పార్టీ మారి వెళ్తున్న వారు చిన్నా చితకా నేతలు, ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు మాత్రమే అయితే దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడనవసరం లేదు కానీ… జిల్లా స్థాయి నేతలు, ఇంతకాలం పార్టీకి వెన్నుపూసగా నిలిచిన నాయకులు పార్టీని వీడి వెళ్తుంటే కేడర్ లో మానసిక బలహీనత ఏర్పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును… ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో “వేవ్” అనే పదానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ వేవ్ అనే మాట ఒక్కసారి మొదలైందంటే… ఇక అది ఏ స్థాయిలో వీస్తుందనడానికి 2019 ఎన్నికలే ఒక గొప్ప ఉదాహరణ. అయితే అంతలా జగన్ కు అనుకూలంగా నాడు ప్రజల్లో వేవ్ రావడానికి కారణం 2014 – 19 మధ్య చంద్రబాబు చేసిన పాలన ఎంత కారణమో… షాడో సీఎంగా చినబాబు తీసుకున్న నిర్ణయాలూ అంతే కారణం అని చెబుతుంటారు పరిశీలకులు!

ఈ క్రమంలో టీడీపీకి బలమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ దెబ్బలు తగులుతున్నాయి. పైగా ఆ పార్టీకి బ్యాక్ బోన్ అని చెప్పుకునే సామాజికవర్గానికి చెందిన నేతలనుంచే ఆ ఎదురుదెబ్బలు తగులుతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కృష్ణాజిల్లాలో బలమైన నేతల్లో ఒకరైన కేశినేని నాని టీడీపీకి బై చెప్పారు.. జగన్ తో భేటీ అయ్యారు!

అది కృష్ణాజిల్లాలో టీడీపీ ఇటీవల తగిలిన అతిపెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ దెబ్బనుంచి తేరుకునేలోపు టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న లింగ‌మ‌నేని శివ‌రాం ప్రసాద్ తాజాగా రాజీనామా చేశారు. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లోనూ ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. కేశినేని నానీకి సన్నిహితుడిగా ఉన్న ఆయన పార్టీని వీడటం పెద్ద దెబ్బనే చెప్పాలి.

ఇప్పటికే గుంటూరు సిట్టింగ్ ఎంపీ గళ్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేది లేదనే సంకేతాలు ఇప్పటికే అందాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఆయనకు సైతం వైసీపీ గాళం వేస్తుందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో తాజాగా గుంటూరు జిల్లాలో టీడీపీకి అన్ని రకాలుగానూ పెద్ద దిక్కుగా చెప్పుకునే రాయపాటి ఫ్యామిలీ నుంచి స్ట్రోక్ తగిలింది.

ఇందులో భాగంగా రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన గోడకున్న చంద్రబాబు ఫోటోను తీసి నేలకేసి కొట్టడం చర్చనీయాంశం అయ్యింది. అనంతరం చంద్రబాబు, నారా లోకేష్ లపై ఆయన చేసిన ఆరోపణలు, విమర్శలు పార్టీలో మరింత చర్చనీయాంశం అయ్యాయి. తండ్రీకొడుకులిద్దరూ బేవార్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… అటు కేశినేని నాని అయినా, ఇటు రాయపాటి రంగారావు అయినా… పార్టీని వీడుతున్నప్పుడు చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు ఒకెత్తు అయితే.. వారు తీసుకొచ్చిన నారా లోకేష్ ప్రస్థావన, అతనిపై చేసిన విమర్శలు, ఛాలెంజ్ లు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇందులో భాగంగా లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ “ఆఫ్ట్రాల్ లోకేష్” అని కేశినేని నానీ అంటే… “అసలు మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తా” అంటూ ఛాలెంజ్ చేశారు రాయపాటి రంగారావు. అంటే… ఆల్ మోస్ట్ టీడీపీ నుంచి బయటకు వచ్చిన బలమైన నేతలిద్దరూ చంద్రబాబు చేసిన మోశాలతో పాటు, చినబాబు లోకేష్ ప్రవర్తనపైనా, అతడు తీసుకున్న నిర్ణయాలపైనా ప్రధానంగా విమర్శలు చేయడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతకముందు కేశినేని నానీ కుమార్తె శ్వేత సైతం చినబాబునే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంటే… టీడీపీని వీడుతున్న నేతలంతా ప్రధానంగా చినబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.. వారు పార్టీని వీడటానికి అతడే ప్రధాన కారణం అని నొక్కి చెబుతున్నారు. దీంతో… టీడీపీ ఫ్యూచర్ స్టార్ చినబాబు నాయకత్వంపై తమ్ముళ్లకు కొత్త సందేహాలొస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.

వీటిని వీలైనంత తొందరగా రూపుమాపడం చేయని పక్షంలో… అవి పార్టీ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. కారణం.. పార్టీ మారిన ప్రతీ నేత, తమ అధినాయకుడిపై విమర్శలు చేయడం సహజం. అయితే… లోకేష్ పై టీడీపీని వీడుతున్న నేతలు చేస్తున్నవి విమర్శలు కాదు… తిట్టు, చివాట్లు కావడం గమనర్హం!