లూథ్రా పై వర్మ సెటైర్స్… గాలిలేని టైర్ ముందు బాబు సిట్టింగ్!

ఆరు నెలలు సవాసం చేస్తే వారు వీరవుతారను కోవాలో.. లేక, వెంటాడుతున్న ఓటమి కలిగించిన స్పూర్తో తెలియదు కానీ… తాజాగా చంద్రబాబుకు, టీడీపీకి కలిపి షాక్ ఇచ్చారు లాయర్ లూథ్రా. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ ఆన్ లైన్ వేదికగా వైరల్ కావడమే కాకుండా… ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

“అన్ని విధాలుగా ప్రయ‌త్నించిన‌ప్పుడు ఇంకా న్యాయం క‌నుచూపు మేర‌లో లేద‌ని తెలిసిన‌ప్పుడు… ఇక కత్తిపట్టడమే. పోరాటానికి ఇదే సరైన విధానం” అని గురు గోవింద్ సింగ్ చేసిన వ్యాఖ్యల‌ను ఆయ‌న ట్వీట్ చేశారు. దీంతో ఇప్పట్లో చంద్రబాబుకు బెయిల్ దొర‌క‌ద‌ని తేలిపోయిందంటూ న్యాయ‌వ‌ర్గాలు లూథ్రా ట్వీట్‌ కు అర్థాల్ని చెబుతున్నాయి!

దీంతో టీడీపీ నాయ‌కులు, కార్యక‌ర్తలతోపాటు చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆత్మ విశ్వాసం దెబ్బతినేలా సిద్ధార్థ లూథ్రా ట్వీట్ చేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి కోట్లు దారబోసి తీసుకొస్తే… చంద్రబాబు కొంప ముంచాడ‌ని ఆ పార్టీ నాయ‌కులు ల‌బోదిబోమంటున్నారని తెలుస్తుంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజ‌మండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ అరెస్ట్ అనంతరం జైలుకి వెళ్లకుండా.. రిమాండ్ పడకుండా కాపాడుకునేందుకు ఢిల్లీ నుంచి అత్యంత ఖ‌రీదైన ప్రముఖ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రాను విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చారు. పైగా ఈయనతో బాబుకున్న సాన్నిహిత్యం ఇప్పటిది కాదని చెబుతుంటారు.

ఆ సంగతి అలా ఉంటే… ఈ ట్వీట్ పై నెటిజన్లు వాయించి వదులుతున్నారు. ఇంతోటిదానికి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని రావాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాబు టైర్ లో గాలి తీసిన లూథ్రా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలో దర్శకుడు రాం గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. న్యాయమూర్తికే అప్పీల్ చేసినంతపనిచేశారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించిన ఆర్జీవీ… సిద్ధార్థ్‌ లూథ్రా ట్వీట్‌.. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉందని అన్నారు. దర్యాప్తు సంస్థలతో పాటు న్యాయ వ్యవస్థపై దాడి చేయాలని ప్రోత్సహించేలా ట్వీట్ ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న లూథ్రా.. న్యాయ వ్యవస్థపైకి దాడులను ప్రేరేపించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని.. న్యాయమూర్తులు లూథ్రా ట్వీట్‌ పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఆర్జీవీ ట్వీట్‌ లో పేర్కొన్నారు.

అక్కడితో ఆగని వర్మ… ఈ గ్యాప్ లో మరో ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పసుపు రంగూ సైకిల్‌ ట్యూబ్‌ లో గాలిపోయిన ఫొటోతో పాటు.. చంద్రబాబు, ఆ పక్కనే బ్రహ్మనందం జైలులో ఉన్న ఫొటోలను ఆయన ట్వీట్‌ చేశారు.

ఏది ఏమైనా… లూథ్రాపై… కొన్ని లక్షల మంది కార్యకర్తలు, వందల మంది నాయకులు, కుటుంబ సభ్యులు, జనసేన అధినేత వంటి వారంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో… ఇలా ఒక్కసారిగా నరాలు కట్ అయిపోయేస్థాయిలో చేసిన ట్వీట్ చేయడం మాత్రం ఫ్యూచర్ చూపించే ప్రయత్నమే అని అంటున్నారు పరిశీలకులు.