విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు వెళితే.. వాళ్ళకి నొప్పి ఎందుకు.?

అసలు విజయేంద్రప్రసాద్‌ని రాజ్యసభకు ఎందుకు పంపుతారు.? పైగా, ఆయన్ని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేయడం ఆశ్చర్యకరం.! ఇలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. చిత్రమేంటంటే, సినీ పరిశ్రమలో ఎవరూ దీన్ని వ్యతిరేకించడంలేదు. ఆయన్ని అంతా అభినందిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి సీనీ జనాలు కృతజ్ఞతలు తెలిపేస్తున్నారు కూడా. వసినీ పరిశ్రమ నుంచి విజయేంద్రప్రసాద్ అలాగే ఇళయరాజా రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే.

పరుగుల రాణి పీటీ ఉష, కర్నాటకకు చెందిన ఓ సామాజిక వేత్త కూడా రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యారు. నిజానికి, ఆయా రంగాల్లో ప్రముఖులకు, ఆయా రంగాలకు సేవలందించినవారికి ఇలాంటి అవకాశం దొరకడం మంచి పరిణామమే. కానీ, ఎవరికో ఎక్కడో బాగా కాలిపోతోంది. ఔను, ప్రత్యేకించి విజయేంద్రప్రసాద్ ఎలా రాజ్యసభకు నామినేట్ అవుతారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఏం, ఎందుకు కాకూడదు.? అన్న ప్రశ్న సహజంగానే పుట్టుకొస్తుంది. రాజ్యసభకు వెళ్ళి దేశాన్ని భ్రష్టుపట్టించినవారిలో విజయ్ మాల్యా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశ చట్టాల్ని గౌరవించకుండా విదేశాలకు పారిపోయాడు విజయ్ మాల్యా, బ్యాంకుల్ని ముంచేసి మరీ. అసలు అలా ఆయన్ని ఎదగనిచ్చింది ఎవరు.? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే కదా.?

కొందరు రాజ్యసభకు ఎంపికవుతారు, కానీ రాజ్యసభ మొహం చూడరు. అలాంటివారి విషయంలో రాజకీయ పార్టీలు నిక్కచ్చిగా వ్యవహరించాలి. కానీ, ఆయా రాజకీయ అవసరాల కోసమే చట్ట సభలకు అర్హత లేని వ్యక్తుల్నీ చట్ట సభలకు నామినేట్ చేస్తున్న రాజకీయ పార్టీలను చూస్తున్నాం.

ఎలా చూసినా, చాలామందితో పోల్చితే విజయేంద్రప్రసాద్ చాలా చాలా బెటర్. ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై వివాదం చేయడంలో అర్థమే లేదు.