స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్పందన దాదాపు శూన్యం అనేది తెలిసిన విషయమే. టీడీపీ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసిన డైరెక్టర్ రాఘవేంద్ర రావు మినహా ఇంకెవ్వరూ స్పందించలేదు.
అయితే సినిమా ఇండస్ట్రీకే చెందిన పవన్ కల్యాణ్ జాతీయ రహదారిపై పొర్లు దండాలు పెట్టినప్పటికీ… అవి సినిమా ఇండస్ట్రీ మనిషి స్పందించిన ఖాతాలోకి రావు. ఆయన రాజకీయ పార్టీ అధినేతగానే స్పందించారని భావించాలి. ఈ సమయంలో టాలీవుడ్ సినిమా నిర్మాత నట్టికుమార్ స్పందించారు. ఇండస్ట్రీ జనాలపై కాస్త ఘాటుగానే స్పందించారు.
ఇందులో భాగంగా.. పరిశ్రమలో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు ఎక్కువ అనే పేరుందని, వీళ్లంతా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు మాత్రం అవికావాలి ఇవికావాలంటూ లబ్ది పొందిన వారే అని అన్నారు. ప్రతీ సందర్భంలోనూ సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారని నట్టికుమార్ తెలిపారు. అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండటం మానవత్వం అని అన్నారు.
దీంతో ఏమనుకున్నారో ఏమో… లేక, జనాలు ఏమైనా అనుకుంటారని అనుకున్నారో తెలియదు కానీ… చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఒక వీడియో వదిలారు నిర్మాత అశ్వినీదత్. ఇందులో భాగంగా చంద్రబాబు అంత గొప్ప వ్యక్తి లేడని చెబుతూ.. ఏపీ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు.
ఈ సమయంలో వీడియో విడుదల చేసిన అశ్వినీదత్… “దేశానికి గొప్ప ప్రధానిని, గొప్ప స్పీకర్ ను, గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుది అని.. అలాంటి నేతను దర్మార్గంగా అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు అశ్వినీదత్. అనంతరం… ఆ మహానీయుడుని అరెస్ట్ కు కుట్ర పన్నిన వారికి పుట్టగతులు ఉండవని శపానార్థాలు కూడా పెట్టారు.
అదంతా ఒకెత్తు అయితే… రాబోయే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పడం గమనార్హం. దీంతో… అలాంటప్పుడు నోటాతో పోటీ పడే బీజేపీతోనూ, గత ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ తోనూ స్నేహం కోసం ప్రాకులాటలెందుకనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆ సంగతి అలా ఉంటే… అశ్వనీదత్ తో పాటు ఇంకెంతమంది సినిమా జనాలు చంద్రబాబుకు మద్దతుగా స్పందిస్తారనేది వేచి చూడాలి.