విద్యని వ్యాపారంగా ఎప్పుడో మార్చేశారు. ‘మేం సర్వీస్ అందిస్తున్నాం.. సేవా భావంతో పనిచేస్తున్నాం.. మాకు మీరు సహకరించాలి..’ అంటూ సుతిమెత్తగా చెప్పే ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని.. ‘ఫీజులు కట్టే స్తోమత లేకపోతే, ప్రభుత్వ స్కూళ్ళలో చేరాలి..’ అంటూ కాస్త ఫీజు కట్టడం లేటయితే నిర్దాక్షిణ్యంగా మాట్లాడే యాజమాన్యాలు కలిగిన విద్యా సంస్థలు మరికొన్ని. అంతిమంగా, ప్రైవేటు విద్యా సంస్థలంటేనే, దోపిడీకి కేరాఫ్ అడ్రస్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
సౌకర్యాలతో సంబంధం లేకుండా.. విద్యా నాణ్యతతో సంబంధమే లేకుండా ఫీజులు వసూళ్ళు చేసే ప్రైవేటు స్కూళ్ళకు లెక్కే లేదు. ఒకరు తక్కువ.. ఇంకొకరు ఎక్కువ కాదు.. అందరూ దాదాపు ఒకటే తంతు. స్థాయి కాస్త అటూ ఇటూ అంతే తేడా. కరోనా కూడా ఈ ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అడ్డుకోలేకపోయింది. పాఠాలు సరిగ్గా చెప్పకుండానే, ఆన్‌లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి మరీ వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి గత ఏడాది దాదాపు అన్ని విద్యా సంస్థలు.
కొత్త విద్యా సంవత్సరం షురూ అవుతోంది.. కాదు కాదు, ప్రైవేటు విద్యా సంస్థలకు ఎప్పుడో మొదలైపోయింది. దాంతోపాటే, దోపిడీకి కూడా మళ్ళీ కొత్తగా తెరలేచింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం, ‘ఫీజులు పెంచితే ఊరుకునేది లేదు’ అంటూ తాజాగా హెచ్చరికలు జారీ చేస్తూ, జీవో విడుదల చేసింది. ప్రభుత్వ పెద్దలు చెబుతూనే వుంటారు.. ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీ చేస్తూనే వుంటాయ్. ఎందుకంటే, అధికార పార్టీల్లో వున్న చాలామంది నేతల కనుసన్నల్లోనే ఈ ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నాయ్ మరి.
‘బోధనా రుసుము మాత్రమే వసూలు చేయాలి’ అని సర్కారు అంటోంది. అంటే, ట్యూషన్ ఫీజు అన్నమాట. కానీ, వాస్తవానికి చాలా స్కూళ్ళలో ఫీజులకు సంబంధించి పూర్తి వివరాలుండవు. అంతా ఒకటే ఫీజు.. కలిపి దోచుడే. విద్యాసంస్థలు ఇలా దోపిడీ చేసి సాధించేదేంటి.? ఏం సాధిస్తాయోగానీ.. సమాజానికైతే మాత్రం, తప్పుడు సంకేతాలు పంపుతున్నాయ్. విద్య లేనివాడు వింత పశువు.. అన్నది పెద్దల మాట. కానీ, విద్యని అమ్ముకుంటున్నవాడు వింత పశువు.. అనాలిప్పుడు.