టీడీపీలో సత్తెనపల్లి ఎఫెక్ట్… అలర్ట్ అయిన పుల్లారావు ఓపెన్ అయిపోయారు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు వణికిపోతున్నారు. తనకు సెంటిమెంట్స్ లేవు, ఎమోషన్స్ లేవు.. ఓన్లీ కాలిక్యులేషన్స్ మాత్రమే ఉన్నాయన్నట్లుగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్స్ కి చెమటలు పట్టించేస్తున్నాయి. దీంతో… సీనియర్ నేతలకు, వారి కుటుంబాలకు చంద్రబాబు రాజకీయ మరణశాసనం రాసేస్తున్నారన్న ఆందోళన తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో అలార్ట్ అవుతున్నారు పుల్లారావు.

దివంగత కోడెల శివప్రసాద్ ఫ్యామిలీని లైట్ తీసుకున్నామని.. సీనియర్ల విషయంలో కాస్త కఠినంగానే ఉంటామని.. శివరాంకు టికెట్‌ ఇవ్వకుండా, కనీసం అభిప్రాయం తీసుకోకుండా, అట్ లీస్ట్ సర్ధిచెప్పకుండానే సత్తెనపల్లి ఇన్‌ చార్జ్‌ గా కన్నాను నియమించడంతో తేల్చేశారు చంద్రబాబు. దీంతో… ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లారావుకు ఎర్త్‌ ఖాయమనిపిస్తోందనే కథనాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో మైకులముందుకు వచ్చారు పుల్లారావు.

గతకొన్ని రోజులుగా గుంటూరు జిల్లా టీడీపీలో బాష్యం ప్రవీణ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మొదట్లో పెదకూరపాడు టిక్కెట్ ఆశిస్తున్నారంటూ కథనాలోచ్చాయి. అయితే కన్నా రాకతో అక్కడి నుంచి తప్పించుకున్న ఆయన… కొమ్మలపాటి శ్రీధర్ ను కూడా దాటుకుని సీటు తెచ్చుకోవడం కష్టమని భావించినట్లున్నారు. దీంతో తాజాగా ఆయన కన్ను చిలకలూరిపేటపై పడింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తెచ్చుకుని పేట నుంచి పోటీచేయాలని ఆయన ఫిక్సయ్యారంట.

ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా న్యోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన ప్రవీణ్… ఈమేరకు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల మహానాడులో చంద్రబాబు వయసు 73 కావడంతో 73 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. పైగా నిత్యం లోకేష్ కు టచ్ లో ఉంటారనే మాట కూడా ప్రవీణ్ విషయంలో వినిపిస్తుంటుంది. అప్పటికీ ప్రతీపాటి పుల్లారావు ధైర్యంగానే ఉన్నా… తాజా కోడెల వ్యవహారంతో కంగారుపడుతున్నారంట.

ఇందులో భాగంగా ఓపెన్ అయిపోయిన ఆయన… అసలు భాష్యం ప్రవీణ్ ఎవరు..? అతడికి చిలకలూరిపేటకు సంబంధం ఏమిటి..? అని ప్రశ్నిస్తున్నారు పుల్లారావు. చిలకలూరిపేటలో భాష్యం ప్రవీణ్‌ కు అసలు ఓటే లేదు.. ఇప్పుడు టిక్కెట్ కోసం సేవా కార్యక్రమాలు,విందులూ అంటూ హడావుడి చేస్తున్నాడే తప్ప… వచ్చే ఎన్నికల్లో టికెట్‌ రాకపోతే ఈ ప్రాంతంలో మళ్లీ కనిపిస్తాడా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇలాంటి నాన్ లోకల్ నాయకులను ప్రోత్సహించొద్దంటూ కేడర్ కు సూచిస్తున్నారు.

మరి తాజాగా ప్రత్తిపాటి వారిపై చూపించిన కోడెల ఎఫెక్ట్… ఇంకా ఎంతమంది సీనియర్స్ పై చూపించబోతుందనేది వేచి చూడాలి.