తోక జాడిస్తున్న తమ్ముళ్లు… ఆత్మవంచన చేసుకుంటున్న బాబు!

టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రతీ కార్యకర్తల సమావేశంలోనూ చంద్రబాబు ఆవేశంగా చెబుతుంటారు. ఎవరైనా పార్టీ నియమాలను దిక్కరించినా, పార్టీ నిర్ణయాలను ఎదురించినా చర్యలుతీసుకుంటానని చెబుతుంటారు. తాజాగా మహానాడు వేదికపై కూడా ఇలాంటి హెచ్చరికలే జారీచేశారు. అయితే బాబు పనితీరు హెచ్చరికలకే పరిమితం తప్ప… అంతకుమించి ఆశించొద్దనే కామెంట్లు తాజాగా తెరపైకి వస్తున్నాయి.

మాటలకూ చేతలకూ ఎంత తేడా అనేది చంద్రబాబుకు తెలియంది కాదు. అయినా కూడా పార్టీలోని నేతలపైన తనకు గ్రిప్ తగ్గలేదని కేడర్ ను ఒప్పించడంకోసం అప్పుడప్పుడూ ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. దీంతో బాబు బలహీనతలను గ్రహించిన నాయకులు… సీనియర్లూ జూనియర్లూ అనే తేడా లేకుండా… బాబుపై తోక జాడిస్తున్నారు. అయితే వీరి తోకలు కత్తిరించే విషయంలో బాబు అలసత్వం వహిస్తున్నారు.. కాదు కాదు.. తప్పించుకు తిరుగుతున్నారు. అలకకి, అసంతృప్తికి, దిక్కారానికి తేడా తెలియనట్లు నటిస్తున్నారు!

క్రమశిక్షణ కలిగిన పార్టీ నేతలు కర్నూలు జిల్లాలో రోడ్డుపై కొట్టుకున్నారు. భూమా అఖిల‌ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య గొడ‌వ బ‌జారుకెక్కింది. అది కూడా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే జరగడం గమనార్హం. ఈ కేసులో టీడీపీ మాజీమంత్రి అఖిల ప్రియ వారం రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. అయితే వీరి విషయంలో కమిటీ వేశామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బాబు డాంబికాలు పలికారు! ఫైనల్ గా… ఆ ఇద్దరు నేతలపై చర్యలు తీసుకునే అంత సీన్ బాబుకి లేదని వినిపిస్తున్న కామెంట్లకు న్యాయం చేశారు.

అనంతరం స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జ్‌ గా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియ‌మించ‌డంపై దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం చంద్రబాబు వైఖరిపై ఫైర్ అయ్యారు. చంద్రబాబునే నిలదీశారు. అంతే కాదు… పార్టీకి అల్టిమేటం ఇచ్చినంత పనిచేశారు. బాబు తీరును మీడియా సాక్షిగా ఎండగట్టారు. వాడుకుని వదిలేయడంలో బాబు సిద్దహస్తుడనే ప్రచారానికి బలం చేకూర్చారు!

వీరితో పాటు తాజాగా మరో సీనియర్ నేత, చిల‌క‌లూరిపేట టీడీపీ ఇన్‌ చార్జ్‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు మైకందుకున్నారు. పార్టీ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాష్యం ప్రవీణ్ కు తన నియోజకవర్గంలో ఫ్రీడం ఇవ్వడంపై పుల్లారావు బాబుని పరోక్షంగా హెచ్చరించినంత పనిచేశారు.

ఇక కేశినేని నాని సంగతి చెప్పనవసరమే లేదు. గ‌త కొంత కాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై నానీ… ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. త‌న‌కు వ్యతిరేకంగా సొంత త‌మ్ముడు కేశినేని చిన్నిని అడ్డుపెట్టుకుని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడంతోపాటు… పరోక్షంగా సవాళ్లు విసురుతున్నారు.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఇలా ఒకరితర్వాత ఒకరు చంద్రబాబుపై దిక్కారస్వరం వినిపిస్తున్నారు. ఉంటే ఉంచుకో లేదంటే తెంచుకో అన్నట్లుగా తెగేసి చెబుతున్నారు. “తాము పార్టీలో కొనసాగేదీ లేదని నీ ప్రవర్తనపై బేస్ అయ్యి ఉంటుంది” అనే స్థాయిలో బాబుకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. మరి ఈ దిక్కార స్వరాలపై బాబు స్పందిస్తారా… క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇలాంటివాటిని ప్రోత్సహించమంటూ చర్యలు తీసుకుంటారా… లేక, అబ్బే ఇవన్నీ అలకలు అని ఆత్మవంచన చేసుకుని సర్ధుకుపోతారా అనేది వేచి చూడాలి.

Prathipati Pulla Rao Sensational Comments On Chandrababu And TDP Leaders | @SakshiTV