పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014 సంవత్సరంలో స్థాపించారు. అయితే ఈ పార్టీని బలోపేతం చేయడానికి పవన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు అయితే రావడం లేదనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ రెండు పడవల ప్రయాణం చేయడం వల్ల జనసేన పార్టీకి నష్టం జరుగుతోంది.
కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం జనసేన పార్టీని పానకంలో పుడక అని కామెంట్ చేస్తున్నారు. ఏ పార్టీతో జనసేనకు పొత్తు ఉందో క్లారిటీ లేదని 2024 ఎన్నికల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుందో స్పష్టత లేదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఉంటే వాళ్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసి 2024 ఎన్నికల సమయానికి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేవారు.
పవన్ ప్రజల్లోకి వెళుతున్నా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం లేదని పవన్ సరైన నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన మరో పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా ఎదగటానికి కృషి చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పాదయాత్ర చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలిసే అవకాశంతో పాటు ప్రజలు పవన్ కళ్యాణ్ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయనకు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడితే ఆయనకు అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.