పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ పై చేస్తున్న విమర్శలు హద్దులు దాటుతున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా పవన్ జగన్ పై పరోక్షంగా విమర్శలు చేయడం గమనార్హం. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి గారి సొంతం అని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
చిరంజీవికి జగన్ నమస్కారం పెట్టినా పెట్టకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదు. వాస్తవానికి చిరంజీవి సైతం ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే. పవన్ మాత్రం పదేపదే అవే విషయాలను ప్రస్తావిస్తూ ప్రజల ముందు చులకన అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ పవన్ కళ్యాణ్ పై కావాలని ఎప్పుడూ విమర్శలు చేయలేదు.
పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేయడం గురించి జగన్ ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ చేసే విమర్శల గురించి డైరెక్ట్ గా స్పందించే విషయంలో కూడా పవన్ వెనుకడుగు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కుటుంబాలకు సహాయం చేయడంలో తప్పు లేదు. ఇలా చేయడం వల్ల ఏపీలోని ఎన్నో కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికంగా బెనిఫిట్ కలుగుతుంది. అయితే ప్రభుత్వంపై ప్రజల కష్టాల గురించి చెబుతూ విమర్శలు చేస్తే పవన్ కు, జనసేనకు బెనిఫిట్ కలుగుతుంది.
ఏ మాత్రం ప్రాధాన్యత లేని విమర్శలు చేస్తే పవన్ ప్రజల సమస్యల గురించి విమర్శలు చేసినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతోంది. పవన్ ను అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా ఆ అభిమానులు పవన్ కు అనుకూలంగా ఓట్లు వేయకపోవడానికి కారణాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ రాజకీయాలలో అనుకూల ఫలితాలు వచ్చే దిశగా అడుగులు వేయాల్సి ఉంది.