తనపై కేసులు పెట్టి, కోర్టుల చుట్టు తిప్పించి, ఆ క్రమంలో తనను చంపించాలని చూస్తున్నారు.. తాను చనిపొతే అందుకు కారణం చంద్రబాబు కుమారుడు, భువనేశ్వరి కుమారుడు, బ్రాహ్మణి భర్త అయిన నారా లోకేష్ అని పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో అడుగు ముందుకు వేసిన పోసాని… నేరుగా డీజీపీని కలిశారు.
తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా… నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నట్టు సమాచారం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన పోసాని… లోకేష్ ద్వారా తనకు పొంచి ఉన్న అనుమానాలు, అనుభవాలు అన్నీ డీజీపికి చెప్పడం జరిగిందని అన్నారు. తాను చెప్పిన వివరాలను డీజీపీ సుమారు అరగంట పాటు సావదానంగా విన్నారని పోసాని తెలిపారు. ఈ మేరకు తనకు భరోసా కల్పించారని అన్నారు.
ఈ సందర్భంగా… ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఒక సాధారణ కార్యకర్త అయిన తనను.. రాష్ట్ర డీజీపీ సాదరంగా రిసీవ్ చేసుకోవడంతోపాటు సుమారు అరగంట పాటు తాను చెప్పిన వివరాలు వినడం, సానుకూలంగా స్పందిస్తూ భరోసా ఇవ్వడం పట్ల తనకు చాలా సంతోషంగా అనిపించిందని పోసాని కృష్ణ మురళి తెలిపారు.
ఈ క్రమంలో… టీడీపీలో చేరాలని తనను తన పీఏ తో అడిగించారని, అందుకు తాను నిరాకరించానని.. దీంతో లోకేష్ ఇగో హర్ట్ అయ్యిందని.. ఫలితంగా తనపై ఈ స్థాయిలో కక్ష గట్టారని పోసాని తెలిపారు. వెన్నుపోటు పొడిచే చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కావడం వల్ల తాను మరింత భయపడినట్లు పోసాని.. డీజీపీకి తెలిపినట్లు తెలిపారు.
ఈ సమయంలో లోకేష్ తో తనను పోల్చొద్దని.. ఆయన చాలా పెద్ద వ్యక్తి అని, అంతటి పెద్ద వ్యక్తికి తాను పోటీ కాదని.. అంత పెద్ద వ్యక్తి కళ్లు ఎర్రచేస్తే తాను కైలాశానికి వెళ్లిపోతానని పోసాని కృష్ణమురళి చెప్పడం కొసమెరుపు!