ప్రస్తుతం ఏపీలో రాజకీయాలూ – సినిమా ఒకే లైన్ లో ప్రయాణిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్, సాయి ధరం తేజ్ నటించిన “బ్రో” సినిమా అనంతరం అంబటి రాంబాబు గ్యాప్ లేకుండా వాయించేస్తున్నారు. పవన్ పై సెటైర్స్ వేస్తూనే.. అది శునకానందం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో తనను రాజకీయంగా ఎదుర్కోలేకే పవన్ కల్యాణ్ ఇలా తన సినిమాల్లో శ్యాంబాబు పాత్ర సృష్టించుకుని శునకానందం పొందుతున్నారని అన్నారు. ఇదే సమయంలో మొదటి రెండు రోజులు మాత్రమే కనిపించిన కలెక్షన్స్ ఆ తర్వాత తుస్సుమనిపించాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో “బ్రో” సినిమాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై కూడా ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక “బ్రో” సినిమాకు సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. ఇందులో భాగంగా… నిర్మాత బ్లాక్ మనీ పెట్టి సినిమాను నిర్మించారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు ఇచ్చినంత రెమ్యూనరేషన్ కూడా ఈ సినిమాకు కలెక్షన్ల రూపంలో రాలేదని సెటైర్ వేశారు.
అయితే అంబటి ఆరోపణలపై ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. తను సినిమాకు ఎంత ఖర్చు చేసింది.. పవన్ కళ్యాణ్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చింది బయటకు చెప్పాల్సిన అవసరం తనకు లేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఏదైనా ఏజెన్సీలు తమను సంప్రదిస్తే తప్పకుండా వివరాలను అందిస్తానని వెల్లడించారు.
మరోపక్క తాను కూడా ఒక సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు అంబటి రాంబాబు. ఈ సినిమాకు కొన్ని టైటిల్స్ అనుకుంటున్నామని.. మరేదైనా సలహాలు ఉంటే పాత్రికేయ మిత్రులు కూడా నిరభ్యంతరంగా ముందుకు రావొచ్చని తెలిపారు. ఇందులో భాగంగా… పెళ్లిల్లు – పెటాకులు, తాళి – ఎగతాళి, మొదలైన టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమయంలో నటి పూనం కౌర్ ఎంటరయ్యారు. పూనం కౌర్ ఏపీ రాజకీయాలు, సినిమాలకు సంబంధించిన కూన్ని సెలక్టివ్ విషయాలపై స్పందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా… “రాజకీయాలు ఎంటర్టెయిన్మెంట్ చుట్టూ తిరుగుతుంటే.. ఎంటర్టెయిన్మెంట్ రాజకీయాలు చుట్టూ తిరుగుతోంది” అంటూ ట్వీట్ చేశారు.
అయితే పూనం కౌర్ ఈ ట్వీట్ లో ఎవరినీ ట్యాగ్ చేయలేదు. ఎవరి పేరు ప్రాస్థావించలేదు. కానీ ఆ ట్వీట్ ఎవరి గురించి చేశారనేది అందరికీ తెలిసిన విషయమే అని అంటున్నారు నెటిజన్లు. ఆ వ్యక్తి విషయంలో ఛాన్స్ వచ్చిన ప్రతిసారీ పూనం స్మూత్ గా ఇచ్చి పాడేస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.