రాజకీయానికి ఆంధ్రప్రదేశ్.! వ్యాపారానికి తెలంగాణ.!

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దాదాపు 10 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో అమర్రాజా బ్యాటరీస్ సంస్థకు సంబంధించి అతి పెద్ద ఫ్యాక్టరీని నెలకొల్పబోతున్నారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన మహబూబ్‌నగర్‌లో ఈ ఫ్యాక్టరీని స్థాపిస్తుండడం గమనార్హం.

రాజకీయాల సంగతి పక్కన పెడితే, అమర్ రాజా బ్యాటరీస్ అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ సంస్థ తన కార్యకలాపాల్ని నిర్వహిస్తూ వస్తోంది. ఎంతోమందికి ఈ సంస్థ ఉపాధి అవకాశాల్ని కల్పించింది. అయితే, బ్యాటరీ పరిశ్రమ విస్తరణ క్రమంలో నిబంధనలకు నీళ్ళొదిలి, కాలుష్యానికి కారణమవుతోందంటూ పరిశ్రమపై ఫిర్యాదులు వచ్చాయి.

దాంతో, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కారు గుస్సా అయ్యింది. దాంతో, చేసేది లేక పరిశ్రమ విస్తరణ ప్రణాళికల్ని సంస్థ పక్కన పెట్టాల్సి వచ్చింది.. పునరాలోచన కూడా చేయాల్సి వచ్చింది. ‘వాళ్ళు వెళ్ళిపోవడం కాదు.. మేమే వెల్లగొట్టాం..’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించేసుకున్నారు.

కానీ, ఇప్పుడేం జరిగింది.? అదే పరిశ్రమకు తెలంగాణ రెడ్ కార్పెట్ వేసింది. ఫలితం వేలాది మందికి అక్కడ ఉపాధి దొరకనుంది. వేల కోట్ల పెట్టుబడులంటే చిన్న విషయం కాదు.

ఇక, ఏపీకి చెందిన చాలామంది రాజకీయ నాయకులకు తెలంగాణలో వ్యాపారాలున్నాయి. వ్యాపారాలు తెలంగాణలో.. రాజకీయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో.!